యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
సీమలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. ప్రధానంగా అనంతపురం జిల్లాలో దారుణ ఓటమితో తెలుగుదేశం పార్టీ నేతలు పార్టీని పూర్తిగా వదిలేశారు. వారు పార్టీ వ్యవహారాలను పక్కనపెట్టి వ్యాపారాలపై దృష్టి పెట్టడంతో కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోయారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. దీనికితోడు గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అనేక చోట్ల పరస్పర దాడులు జరుగుతున్నాయి.కార్యకర్తలపై దాడులు జరుగుతున్నా నేతలు అందుబాటులో లేకపోవడంతో కార్యకర్తలు తల్లడిల్లిపోతున్నారు. ప్రధానంగా అనంతపురం జిల్లాకు చెందిన నేతలకు బెంగళూరు, హైదరాబాద్ లలో వ్యాపారాలున్నాయి. గత ఐదేళ్లుగా వ్యాపారాలను పట్టించుకోకపోవడంతో ఓటమి తర్వాత వాటిపైనే కొందరు నేతలు దృష్టి పెట్టారు. మరికొందరు విదేశాలకు పయనమయి వెళ్లిపోయారు. దీంతో తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక తెలుగు తమ్ముళ్లు ఇబ్బందులు పడుతున్నారు.అనంతపురం జిల్లా అంటేనే ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతం. అక్కడ గ్రూపు తగాదాలు ఎక్కువగా ఉండటంతో అధికారంలో ఉన్న పార్టీ దే పైచేయి అవుతుంది. గత ఐదేళ్ల పాటు అధికారాన్ని అనుభవించిన తెలుగుదేశం పార్టీ క్యాడర్ పవర్ చేజారిపోవడంతో గ్రామాలను వదిలేసి సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకునేందుకు వెళ్లిపోయారు. కొన్ని గ్రామాల్లో ముఖ్య కార్యకర్తలెవరూ లేకపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతుంది. గ్రామాల్లో యుద్ధ వాతావరణం నెలకొని ఉండటంతో చల్లబడ్డాక వద్దామని ద్వితీయ శ్రేణి నేతలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు.తమకు అండగా నిలబడేందుకు నేతలు అందుబాటులో లేకపోవడంతో కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు ప్రాణభయంతో వేరే చోట తలదాచుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీకి గట్టి లీడర్ గా ఉన్న వరదాపురం సూరి వంటి వారే పార్టీని వీడారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. నేతల దన్ను లేకుండా కార్యకర్తలు గ్రామాల్లో తిరగలేమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబునాయుడు అనంతపురం జిల్లా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. భయంతో గ్రామాలను వదిలి వెళ్లిన కార్యకర్తలకు ధైర్యం నూరిపోశారు.