యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఓ ప్రైవేట్ టూరిస్టు బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ముగ్గురు మహిళలు మృతిచెందారు.
ఈ సంఘటన విశాఖ జిల్లా పాడేరు మండలం వంట్లమామిడి ఘాట్రోడ్డులో సోమవారం అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో 37 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తీవ్రగాయాలైన నలుగురిని విశాఖ కేజీహెచ్కు తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో వర్షం పడడంతో సహాయక చర్యలు అందక క్షతగాత్రులు మూడు గంటలపాటు అవస్థలు పడ్డారు. బాధితులంతా తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందినవారు. వీరు ఒడిశా రాయ్గఢ్లోని మజ్జిగౌరమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోనే మరో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎలమంచిలి మండలం పులపర్తి జంక్షన్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో 10 మందికి గాయాలయ్యాయి. లారీ, ఆర్టీసీ బస్సు ఒకదానికొకటి పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలు కాగా వారిలో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు