YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

11 నుండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

11 నుండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ఈనెల 11 నుండి ప్రాంరంభం కానున్న రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రశాంతంగా సజావుగా పూర్తి అర్థవంతంగా జరిగేలా ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రతి ఒక్కరూ అన్ని విధాలా సహకరించాలని రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారామ్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ శాసన సభ కమిటీ హాల్లో రానున్న బడ్జెట్ సమావేశాల నిర్వహణ ఏర్పాట్లపై వివిధ శాఖల కార్యదర్శులు, పోలీస్ ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ శాసన సభకు సుమారు 70 మంది వరకూ కొత్తవారు ఎన్నికైనందున వారందరికీ సభా వ్యవహారాలపై పూర్తి అవగాహన కలిగించేందుకు వివిధ అంశాల్లో చర్చ జరిగేందుకు సభను మెరుగైన రీతిలో నిర్వహించేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సభలో వివిధ అంశాలపై ఉద్దేశ్య పూర్వకంగా చర్చ జరగకుండా సభ్యులడిగే ప్రశ్నలకు సమాధానాలు దాట వేశారని, అపవాదు లేకుండా ప్రతి సభ్యునికి తగిన అవకాశం కల్పించేందుకు పూర్తిగా కృషి చేస్తానని చెప్పారు. ముఖ్యంగా వివిధ శాఖలకు సంబంధించి సభ్యులు అడిగే ప్రశ్నలకు సకాలంలో సమాధానాలు పంపాలని... ఈ విషయంలో సంబంధిత శాఖల కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని స్పీకర్ సీతారామ్ కోరారు. రానున్న సమావేశాల్లో సభ్యులు అడిగే ప్రశ్నలకు సమావేశాలు ముగిసేలోపే సమాధానాలు పంపాలని స్పష్టం చేశారు. అలాగే శాసన సభలో ప్రవేశపెట్టబోయే వివిధ బిల్లులను ముందుగానే సిద్ధం చేసి పూర్తిగా అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత మాత్రమే శాసన సభలో ప్రవేశపెట్టేందుకు పంపాలన్నారు. అంతేతప్ప ప్రవేశపెట్టబోవు బిల్లు ఏమిటో ఎందుకు ప్రవేశపెడుతున్నామో అనేది తెలియకుండా చివరి నిమిషంలో ఆదరబాదరా బిల్లులు ప్రవేశపెట్టే ప్రయత్నం ఎంతమాత్రం చేయరాదని ఆయన స్పష్టం చేశారు. అదే విధంగా వివిధ శాఖలకు సంబంధించిన వార్షిక నివేదికలను సకాలంలో సభకు సమర్పించాలని చెప్పారు. కొత్తగా సభ్యులై మంత్రులుగా నియమించబడిన వారికి ఆయా శాఖలకు సంబంధించిన అంశాలపై పూర్తి అవగాహన ఏర్పరుచుకునేందుకు కార్యదర్శులు పూర్తిగా సహకరించాలని స్పీకర్ సూచించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, సభలో సభ్యులు అడిగిన నక్షత్ర, నక్షత్రేతర జిరో ఆవర్ లో అడిగిన తదితర ప్రశ్నలకు ఆయా శాఖల కార్యదర్శులు సకాలంలో సమాధానాలు పంపాలని ఆదేశించారు. రానున్న సెషన్ లో 10 నుండి 12 వరకూ బిల్లులు శాసన సభల్లో ప్రవేశపెట్టే అవకాశాలున్నందున ఆయా బిల్లులు ముందస్తుగానే రూపొందించి సకాలంలో శాసన సభలో ప్రవేశపెట్టేందుకు సంబంధిత శాఖల కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. అన్ని శాఖల బిల్లులు, ప్రశ్నలకు సమాధానాలు తదితర అంశాలన్నిటినీ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్పీ సిసోడియాను పర్యవేక్షించాలని సిఎస్ చెప్పారు. అదేవిధంగా ఇప్పటి వరకూ శాసన సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలు (LAQ,LCQ) లకు సంబంధించి సమర్పించాల్సిన సమాధానాలన్నిటినీ వెంటనే శాసన సభకు సమర్పించాలని కౌన్సిల్ అధ్యక్షులు, స్పీకర్ పరిశీలించి వాటిని ముగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

Related Posts