యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
పదమూడు నెలలుగా కలహాల కాపురంలా సాగుతోన్న కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో తలెత్తిన అసమ్మతితో కన్నడ రాజకీయాలు మరింత వేడెక్కాయి. అసంతృప్తి ఎమ్మెల్యేలను బుజ్జగించే ప్రయత్నాలను కాంగ్రెస్, జేడీఎస్ నేతలు ముమ్మరం చేశారు. గతంలో తమిళనాడులో ఇటువంటి పరిస్థితే ఎదురైనప్పుడు నాటి ముఖ్యమంత్రి కామరాజ్ అనుసరించిన వ్యూహాన్నే ప్రస్తుతం కొనసాగించాలని జేడీఎస్, కాంగ్రెస్ నేతలు తీర్మానించారు. కామరాజ్ నాడార్ సీఎంగా ఉన్న సమయంలో కొందరు రెబల్స్ తిరుగుబావుటా ఎగురువేశారు. దీంతో ఆయన మొత్తం క్యాబినెట్ మంత్రులతో రాజీనామా చేయించి, కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం కీలక చర్చలు మొదలయ్యాయి. ఇందులో భాగంగానే కాంగ్రెస్, జేడీఎస్ మంత్రులతో రాజీనామా చేయించారు. జులై 21న పునర్వవస్థీకరించి, అసంతృప్త నేతలందరికీ అవకాశం కల్పించునున్నారు. దీనిపై కర్ణాటక కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ కె.సి.వేణుగోపాల్ ప్రకటన వ్యూహాత్మక అంశం. తమ రాజీనామాలను ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని అసమ్మతి నేతలు స్పష్టం చేయడం మరో రణతంత్రం. సదాశివనగరలోని డిప్యూటీ సీఎం డాక్టర్ పరమేశ్వర్ నివాసంలో కాంగ్రెస్-జేడీఎస్ నేతల కీలక భేటీ సోమవారం వాడివేడిగా సాగింది. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే, మంత్రి నాగేశ్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి.. ప్రకంపనలు రేపారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను ఆయన నేరుగా కలసి రాజీనామా పత్రాన్ని అందించి సంచలనం సృష్టించారు. వీరితోపాటు మరో ఆరుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తున్నారని ప్రచారం ఊపందుకుంది. బాగేపల్లి ఎమ్మెల్యే సుబ్బారెడ్డి, హెగ్గడదేవనకోట ఎమ్మెల్యే అనిల్ చిక్కమాదు, కంప్లి ఎమ్మెల్యే గణేశ్, హగరి బొమ్మనహళ్లి సభ్యుడు భీమానాయక్‌లు రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతున్నా ఎవరూ నిర్ధరించలేదు. అయితే, మంగళవారం జరిగిన సీఎల్పీ భేటీకి అసమ్మతి ఎమ్మెల్యే రామలింగారెడ్డి కుమార్తె సౌమ్యారెడ్డి హాజరయ్యారు. ఈ సంక్షోభానికి నాన్న కారణం కాదని, సంకీర్ణ నేతల ద్వంద్వ విధానాలే కారణమని ఆమె ధ్వజమెత్తారు. కాగా, శివాజీనగర ఎమ్మెల్యే రోషన్ బేగ్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు లేఖను స్పీకర్‌కు పంపారు. మంగళవారం సాయంత్రానికి మరో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయనున్నారని తెలుస్తోంది. మరోవైపు, పరిస్థితి పూర్తిగా చేయి జారిపోలేదని, రాజీనామా చేసిన రెబల్స్ వెనక్కు వచ్చేస్తారని కూటమి సమన్వ కమిటీ ఛైర్మన్ సిద్ధరామయ్య విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని ఆయన తేల్చిచెప్పడంతో కాంగ్రెస్ ప్రయత్నాలు జోరుగానే ఉన్నాయని స్పష్టమవుతోంది. పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ‘ఆపరేషన్ కమల’కు మద్దతుగా గవర్నర్ కార్యాలయం పని చేస్తోందంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను బీజేపీ నేత అశోక్ ఖండించడం విశేషం.