ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. టీడీపీ రాజ్యసభ ఎంపీల చేరికతో మొదలైన వలసలు.. ఊపందుకుంటున్నాయి. తాజాగా టీడీపీకి సీనియర్ నేత, ప్రకాశం జిల్లా మాజీ జెడ్పీ ఛైర్మన్ ఈదర హరిబాబు షాకిచ్చారు. పార్టీకి రాజీనామా చేసి.. తన తనయుడితో కలిసి ఢిల్లీలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా సమక్షంలో బీజేపీ గూటికి చేరారు. ఈదరకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. బీజేపీలో చేరడం ఆనందంగా ఉందన్నారు ఈదర హరిబాబు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యేగా, జెడ్పీ ఛైర్మన్‌గా పనిచేసిన ప్రకాశం జిల్లాలో ఈదర హరిబాబు టీడీపీలో సీనియర్ నేతగా ఉన్నారు. 2104 ఎన్నికల తర్వాత జెడ్పీ ఛైర్మన్ పదవి విషయంలో టీడీపీతో విభేదాలు వచ్చాయి. అనూహ్యంగా వైసీపీతో కలిసి ఛైర్మన్ పదవి దక్కించుకున్న ఆయన.. టీడీపీకి దూరంగా ఉంటూ వచ్చారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు చంద్రబాబు ఆయన్ను పిలించి మాట్లాడారు.. టీడీపీ కోసం పనిచేయాలని కోరారు. చంద్రబాబు కోరడంతో.. ఈదర హరిబాబు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల కోసం ప్రచారం చేశారు. ఒంగోలు, అద్దంకి, సంతనూతలపాడుతో పలు నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపు కోసం పనిచేశారు. ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభమయ్యాక.. ఈదర పార్టీ మారతారని ప్రచారం జరిగింది. అంతేకాదు ఆయనకు ఎంపీ సుజనా చౌదరితో పరిచయాలు కూడా ఉన్నాయి. సుజనా ఈదరతో చర్చలు జరిపి.. బీజేపీలో చేరేందుకు ఒప్పించారని తెలుస్తోంది. ఇప్పటికే ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ ఇటీవలే బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈదర కూడా కాషాయ కండువా కప్పుకున్నారు. ప్రకాశం జిల్లా నుంచి మరికొందరు టీడీపీ నేతలు కూడా బీజేపీలో చేరతారని చర్చ నడుస్తోంది.