తెలుగు సినీ పరిశ్రమలోని మంచి టాలెంట్ ఉన్న యంగ్ హీరోల్లో సాయి ధరమ్ తేజ్ ఒకరు. మేనమామలు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోలికలను కలగలుపుకుని పుట్టిన తేజూ సుప్రీం హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం పోలికల్లోనే కాదు సేవా దృక్పథంలోనూ మావయ్యలనే పోలారు తేజూ. ఇప్పటికే ఆయన పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. థింక్ పీస్ ఆర్గనైజేషన్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి కొన్నేళ్లుగా పనిచేస్తున్నారు. ఎంతో మంది పిల్లలను దత్తత తీసుకున్నారు. ఇప్పుడు ఒక స్కూల్‌ని దత్తత తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. విరాళాలు ఇవ్వాలని తన అభిమానులను కూడా కోరారు. ‘థింక్ పీస్ ఆర్గనైజేషన్‌తో కలిసి గత కొన్నేళ్లుగా నేను పనిచేస్తున్నాను. ఇప్పుడు మున్నిగూడలోని అక్షరాలయ స్కూల్‌ని దత్తత తీసుకున్నాను. మొత్తం 100 మంది పిల్లలకు రెండేళ్లపాటు విద్య, పోషకాహారాలను నేను అందిస్తాను. ఆ సంతోషకరమైన ముఖాలను చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. కాబట్టి, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది ఒక్కటే.. మీకు తోచినంత విరాళంగా ఇవ్వండి. పిల్లలు, నేను, థింక్ పీస్ ఆర్గనైజేషన్ అంతా మీ ప్రోత్సాహాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం. ఈ ఏడాది మరో 50 మంది పిల్లలను నేను దత్తత తీసుకుంటాను’ అని తేజూ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. అలాగే విరాళాలు అందజేయడానికి వెబ్‌సైట్ లింక్‌ను కూడా తన పోస్టులో పొందుపరిచారు. ఇక సాయి ధరమ్ తేజ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ‘ప్రతిరోజూ పండగే’ అనే సినిమాలో నటిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్కేఎన్ సహ నిర్మాత. తేజూ సరసన రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఎస్.ఎస్.తమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. జయకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.