YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బడ్జెట్ సమావేశాలపై రివ్యూ

బడ్జెట్ సమావేశాలపై రివ్యూ

ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ సమావేశాల నిర్వహణపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం సమీక్ష చేపట్టారు. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులుతో జరిగిన సమీక్షలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై వారికి పలు సూచనలు చేశారు. సమావేశాలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈసారి 70 మంది సభ్యులు తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారని చెప్పారు. వాస్తవిక దృక్పథంతో అసెంబ్లీ సమావేశాలు జరిగేలా కృషి చేద్దామన్నారు. సభలో మాట్లాడేందుకు అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. గత అసెంబ్లీ సమావేశాల్లో ఉద్దేశపూర్వకంగానే కొన్ని అంశాలు చర్చకు రాకుండా చేశారని అన్నారు.ఇకపై అసెంబ్లీలో అర్థవంతమైన చర్చ జరిగిందని ప్రజలు భావించేలా సమావేశాలు నిర్వహణ ఉంటుందని తెలిపారు. అధికారులు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సకాలంలో సమాధానాలు సిద్ధం చేసేలా ఉండాలని ఆదేశించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఒక బృందంగా పనిచేసి శాసనసభ గౌరవాన్ని పెంచుదామని అన్నారు. ప్రభుత్వ బిల్లులను వాటి ఉద్దేశాలను ఉన్నతాధికారులు అధ్యయనం చేసిన తర్వాతే ముసాయిదాను సభ ముందు ఉంచాలని సూచించారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాలకు కల్పించాల్సిన భద్రతపైన పోలీసు ఉన్నతాధికారులతో స్పీకర్‌ సమీక్ష నిర్వహించారు. భద్రతా ఏర్పాట్లు, బందోబస్తు సమన్వయం కోసం అసెంబ్లీ ఆవరణ బయట ఓ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భద్రత కారణాల రీత్యా అసెంబ్లీ సందర్శకుల సంఖ్యను పరిమితం చేయాలని స్పీకర్‌ ఆదేశించారు. రోజుకు 500 మంది వరకు మాత్రమే సందర్శకులను అనుమతించాలని స్పష్టం చేశారు. కాగా, జూలై 11 నుంచి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. 12వ తేదీన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు

Related Posts