యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మావాడే అంటుంటే కాదు మా వాడు అంటున్నారు వారు. కాంగ్రెస్ – వైఎస్సాఆర్ పార్టీలకు ఈ పంచాయితీ జీవితకాలం నడిచేలాగే వుంది. దాంతో వైఎస్ జయంతి వర్ధంతి కార్యక్రమాలు ఈ రెండు పార్టీలు విధిగా కొనసాగిస్తుండటం చర్చనీయం అవుతున్నాయి. వైఎస్ పేరుతోనే ఆయన కుమారుడు పార్టీ స్థాపించడం ఆయన వారసుడిగా జగన్ ఉండటంతో సహజంగానే అన్ని జిల్లాల్లో వైఎస్ జయంతులు వర్ధంతులు వైసిపి జోరుగానే నిర్వహించింది. అయితే కాంగ్రెస్ కూడా వున్న కొద్దిపాటి నేతలతో వైఎస్సాఆర్ కు నివాళి అర్పిస్తూ తమవాడే అనిపించుకునే ప్రయత్నాన్ని మాత్రం ఆపడం లేదు.వాస్తవానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయేవరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. అయితే ఆయన అకాల మరణం తరువాత వైఎస్ కుటుంబం రాజకీయంగా ముందుకు సాగకుండా కాంగ్రెస్ అధిష్టానం అడ్డుపడింది. ఆయన మరణంతో చనిపోయిన వారిని ఓదార్పు యాత్రకు వెళ్లేందుకు వైఎస్ జగన్ ప్రయత్నిస్తే దానికి అనుమతి లేదంటూ నో చెప్పేసింది. పార్టీకి తన తల్లి తో సహా రాజీనామా చేసి బయటకు వచ్చి జగన్ ఓదార్పు యాత్ర చేపట్టారు. దీనిపై కక్షకట్టిన కాంగ్రెస్ అధిష్టానం కోర్ట్ ద్వారా ఆయనపై సిబిఐ, ఈడీ లతో వేధింపులకు దిగడం జైలుకు సైతం పంపడంతో ఎపి లో వైఎస్ అభిమానులకు కాంగ్రెస్ రాజకీయాలపట్ల విరక్తి ఏర్పడేలా చేసింది.ఈ పరిణామాలు జగన్ కి కలిసొచ్చాయి. ఆయన పార్టీకి జనాదరణ పెరుగుతూ వచ్చింది. 2004 లో అధికారానికి దగ్గర వచ్చి వెనకబడిన వైసిపి ఓటు బ్యాంక్ చూశాకా కాంగ్రెస్ నాలిక కరుచుకుంది. దాంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి నామస్మరణే ఎపి లో చేయాలనీ గుర్తించి మావాడు అనిపించుకునే కార్యక్రమాలు మొదలు పెట్టింది. అయితే అప్పటికే జరగాలిసిన నష్టం జరిగిపోవడంతో ఆ పార్టీకి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఒక పక్క రాష్ట్ర విభజన తో రెండు రాష్ట్రాల్లో ప్రధానంగా ఎపి లో కాంగ్రెస్ భూస్థాపితం అయిపొయింది. తెలంగాణాలో టిఆర్ఆస్ పుణ్యమా అని వున్న ఉనికి కోల్పోతూ అక్కడ జీరో అయ్యే ప్రమాదం లో పడింది.గులాబీ పార్టీకి తోడు ఇప్పుడు కమలం ఆపరేషన్ ఆకర్ష్ కి భవిష్యత్తు అంధకారమే అన్న సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతోంది. అదే వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికే ఉంటే రాష్ట్ర విభజన అయ్యేది కాదు తమ పార్టీ ఇంత బలహీనపడేది కాదని ఇప్పుడు అధిష్టానం నుంచి కింది స్థాయి వరకు కన్నీళ్ళు పెట్టుకునే స్థితికి చేరుకుంది. ప్రజల గుండెల్లో వుండే ఒక లీడర్ వున్నప్పుడు లేనప్పుడు జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి అన్నదానికి డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణమే అద్దం పడుతుంది. అందుకే చనిపోయినా తమనేత బతికే వున్నాడన్న భావనలో అటు వైసిపి ఇటు కాంగ్రెస్ ఆయనకు నివాళి అర్పిస్తూ ఆయనవెంటే మేమంతా అనడం గమనార్హం.