యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రాష్ట్రంలో ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కీలక రాజకీయ శక్తిగా ఉన్న కాపు సామాజిక వర్గం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. 2014లో చంద్రబాబు నాయుడుకు అండగా నిలిచిన ఈ వర్గం.. 2109 ఎన్నికల నాటికే రూటు మార్చింది. ఈ క్రమంలోనే కాపు వర్గంలో టీడీపీకి పడతాయని భావించిన ఓట్లు పూర్తిగా దారిమళ్లాయి. దీనిపై టీడీపీ ఆత్మ పరిశీలన ప్రారంభించింది. “ కాపులకు మనం ఎంతో చేశాం. అయినా ఆ వర్గం మనకు ఎందుకు దూరమైంది“ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు – ఇటీవల నిర్వహించిన సమీక్షలో ఆశ్చర్మం వ్యక్తం చేశారు.నిజమే..! టీడీపీ ప్రభుత్వం గడిచిన ఐదేళ్ల కాలంలో కాపులకు అనేక రూపాల్లో సాయం చేసింది. కాపు కార్పొరేషన్ ఏర్పాటు నిజానికి సంచలన నిర్ణయం. కొన్ని కోట్ల రూపాయలను కేటాయించి విద్యా నిధి వంటి కార్యక్రమాలను కూడా చంద్రబాబు అమలు చేశారు. అదే సమయంలో విదేశాలకు వెళ్లి చదువుకునే వారికి కూడా చంద్రబాబు అవకాశం కల్పించారు. ఇక, 2014 నాటి కాపు రిజర్వేషన్ విషయంపైనా అసెంబ్లీలో తీర్మానం చేసి, అప్పట్లోనే కేంద్రానికి పంపారు. తన మంత్రి వర్గంలోనూ కాపులకు అవకాశం కల్పించారు. అయినప్పటికీ కాపులు ఎందుకు దూరమయ్యారనే విషయంపై పెద్ద ఎత్తున ఆయన విస్మయం వ్యక్తం చేశారు.అయితే, కాపు సమాజం మాత్రం బాబు తమకు అన్యాయం చేశారని, తమకు స్వాతంత్య్రం లేకుండా వ్యవహరించారని, పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ తమ వాయిస్‌ను వినిపించే అవకాశం లేకుండా చేశారని ఆరోపిస్తోంది. ఇక, ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో టీడీపీ ఎదుగుదల ప్రశ్నార్థకంగా మారిందని భావిస్తున్న నేపథ్యంలో కాపులు ప్రత్యామ్నాయం దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రధానంగా జనసేన అధినేత, కాపు సామాజిక వర్గానికే చెందిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పార్టీలోకి వచ్చే నేతలకు తలుపులు బార్లా తెరవడం కూడా కాపులకు కలిసి వస్తున్న అంశం. దీంతో కాపులు ఇక టీడీపీకి రాం చెప్పాలని నిర్ణయించారు.అదే సమయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా కాపులపై దృష్టి పెట్టింది. కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ చీఫ్‌గా ఉండడంతో కాపు వర్గాన్ని సాధ్యమైనంత ఎక్కువగా పార్టీలోకి ఆహ్వానించే బాధ్యతను ఆయనకు అప్పగించినట్టు చెబుతున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవిని సైతం పార్టీలోకి ఆహ్వానించి ఆ వర్గాన్ని ఆకర్షించే ప్రయత్నాలు అప్పుడే ప్రారంభమయ్యాయి. ఇటీవల కాపు నాయకులు అందరూ సమావేశం కావడం ఈ సందర్భంగా ప్రస్థావనార్హం. జరుగుతున్న పరిణామాలను బట్టి టీడీపీకి కాపులు గుడ్ బై చెప్పే రోజులు అతి సమీపంలోనే ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. ఫైనల్‌గా ఒక్కటి మాత్రం నిజం టీడీపీని కాపులు నమ్మి మాత్రం ఆ పార్టీలో ఉండడం లేదన్న విషయంపై క్లారిటీ వచ్చింది.