యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
కడప జిల్లాలో పసుపు పంట సాగు చేసేందుకు రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. కడప, కమలాపురం, బద్వేలు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో అధికశాతం మంది రైతులు పసుపు సాగు చేస్తున్నారు. పసుపుసాగుకు వర్షంతో పనిలేకపోయినా ఆరుతడి పంట అయిన పసుపు ఏటా జిల్లాలో 15వేల ఎకరాలు పైబడి సాగుచేసుకునే రైతాంగం ఈమారు 20వేల ఎకరాలు సాగయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ ఏడాది ప్రభుత్వమే మార్క్‌ఫెడ్ ద్వారా క్వింటాకు రూ.5వేలు పైబడి చెల్లించి కొనుగోలు చేయడంతో మార్కెట్‌లో కొనుగోలు సమస్య తగ్గింది. కోల్డ్ స్టోరేజిలు ఉన్నట్లయితే పసుపుపంటకు గిరాకి పెద్దగా ఉంటుంది. జిల్లాలో 2 కోల్డ్‌స్టోరేజిల నిర్మాణానికి ముఖ్యమంత్రి ప్రకటనతో రైతులు పసుపుసాగుపై ఆసక్తి కన్పిస్తున్నారు. జిల్లాలో ప్రాజెక్టులు, చెరువుల పరివాహక ప్రాంతాల్లో పసుపుసాగుకు రైతులు చూపుపెట్టారు. కొంతమంది ఇప్పటికే పసుపుసాగును కూడా చేస్తున్నారు. సాధారణంగా ఎకరా పసుపు సాగు చేసేందుకు రూ.80వేలు పైబడి ఖర్చు అవుతుంది. ఎకరాలకు 50క్వింటాళ్ల పసుపుదిగుబడి కావాల్సివుండగా 40క్వింటాళ్లు దిగుబడి అవుతోంది. ప్రాజెక్టులు, చెరువులు, కాలువలు ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల్లో ఎకరాకు 50 క్వింటాళ్లు దిగుబడి అవుతోంది. అయితే ఇప్పటివరకు పసుపురైతుకు పెద్దగా గిట్టుబాటు ధర లభించలేదు. గతంలో పసుపురైతులు పసుపు కోసిన వెంటనే ఎండబెట్టి అనంతరం వాటిని కళ్లాలకు చేర్చుకుని వాటిని ఉడకబెట్టి ఆరబెట్టిన అనంతరం పసుపును మార్కెట్‌కు తరలిస్తారు. 20వేల ఎకరాల్లో దిగుబడి వచ్చినట్లయితే రైతులకు రూ.50కోట్ల మేరకు ఉడకబెట్టేందుకు వ్యయం వస్తుంది. గత ఏడాది పసుపు క్వింటాకు రూ.7,500 నుంచి రూ.9వేల వరకు ధర ఉండేది. మూడేళ్లక్రితం క్వింటాకు రూ.3వేల నుంచి రూ.4వేల వరకు ధర పలికేది. గతంలో పోల్చుకుంటే ఈమారు పసుపుధర ఆశాజనకంగానే ఉంది. ఎకరాకు ఈమారు 20 నుంచి 30 క్వింటాళ్ల వరకే దిగుబడి వచ్చింది. ఈమారు రైతులు పసుపుపంటకు గిట్టుబాటు ధర లభించడం ప్రభుత్వమే కొనుగోలు చేయడమేనని రైతులు అంటున్నారు. ప్రభుత్వం కోల్డ్ స్టోరేజిలు ఏర్పాటుచేసి పసుపురైతుకు రాయితీ కల్పిస్తే పసుపుపంట లాభదాయకంగా ఉంటుందని రైతులు భావిస్తున్నారు. సంబంధిత అధికారులు కూడా రైతులకు తగిన సూచనలు ఇచ్చి అధిక దిగుబడికి సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది