యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
నైరుతి రుతుపవనాల ప్రభావం కోస్తా, రాయలసీమలపై నామమాత్రంగానే ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం లేకపోవడంతో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురిసినా
రాయలసీమలో మాత్రం పొడి వాతావరణం నెలకొంది. అనేకచోట్ల పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యాయి. నెల్లూరు, తిరుపతిలో 40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి రుతుపవనాలు చురుకుగా మారేంత వరకు ఎండలు కొనసాగుతాయని, వర్షాలు తక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే రానున్న 24 గంటల్లో కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.