యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం కలగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చనిపోయిన రైతు కుటుంబాలకు ఇచ్చే నష్టపరిహారం వేరొకరు తీసుకోలేని విధంగా చట్టం తీసుకొస్తున్నామని వెల్లడించారు. రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కుటుంబం వద్దకు కచ్చితంగా కలెక్టర్ వెళ్లాలని, ఈ విషయమై మళ్లీ సీఎం కార్యాలయం చెప్పే పరిస్థితి ఉండకూడదని అన్నారు. స్పందన కార్యక్రమంను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలన్నారు. స్పందన కంటే ఏ ఇతర కార్యక్రమం ప్రాధాన్యత కాదని, నాణ్యమైన పరిష్కారం ఉండాలన్నారు. నిర్దేశిత సమయంలో పరిష్కరించాలని, తరువాత స్పందన నాటికీ పరిష్కరించుటకు చర్యలు చేపట్టాలన్నారు. తన స్థాయి నుంచి తాను క్లీన్ చేయడం మొదలుపెట్టానని, అధికారులు వారి స్థాయిలో వారు మండల స్థాయి అధికారులను పిలిపించుకుని క్లీన్ చేయాలని అన్నారు. శాఖల వారీ పరిష్కారం గూర్చి జిల్లా కలెక్టర్ లు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. అన్ని మండలాల్లో స్పందన కార్యక్రమం పక్కాగా నిర్వహించాలని, కార్యాలయాలు, విద్యాసంస్థలు, వసతి గృహాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించాలన్నారు. జిల్లా క్రైమ్ రికార్డు బ్యూరో లెక్కల ప్రకారం అర్హులైన వారికి నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఈ డబ్బును ఇతర ఖాతాల్లో జమ చేసుకోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కుటుంబ యజమాని నిరాశ నిస్పృహలతో ఉన్నప్పుడు అటువంటి డబ్బును ఇతరుల ఖాతాల్లో జమచేయడం సరికాదన్నారు. అవినీతి అనేది మండల కార్యాలయాల నుండి నిర్మూలించుటకు పూర్తి చర్యలు తీసుకోవాలన్నారు. మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసినా తహశీల్దార్ కార్యాలయంలో డబ్బు ఇస్తేగాని పనికాదు అనే పేరు ఉందని అయన అన్నారు. అన్ని కార్యాలయాలు, వసతి గృహాల్లో ప్రక్షాళన చేయాలన్నారు. గ్రామ సచివాలయంలో రేషన్ కార్డు వంటి వాటికి దరఖాస్తు చేస్తే 72 గంటల్లో పరిష్కరించాలనే ఆలోచన ఉందన్నారు. గ్రామంలోనే సామాజిక ఆడిట్ జరుగుతుందన్నారు.