యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం వద్ద అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. దీంతో.. తాడేపల్లిలోని ఆయన నివాసం వద్ద అలెర్ట్ ప్రకటించిన పోలీసులు.. భారీగా మొహరించారు. బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకున్న ఈ పరిణామంతో భద్రతా సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏపీ వ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్లు జగన్ నివాసాన్ని ముట్టడిస్తామని ప్రకటించారు. పెద్ద ఎత్తున రేషన్ డీలర్లు సీఎం నివాసాన్ని చేరుకోవాలని నిర్ణయించారు. దీంతో.. సెక్షన్ 30ని అమలు చేస్తున్నారు. రేషన్ డీలర్లతో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ నిరసన చేపట్టారు.ఈ నేపథ్యంలో ఎప్పుడూ లేనంతగా ముఖ్యమంత్రి నివాసానికి భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. రేషన్ సామాన్లను త్వరలో ఎంపిక చేసే వాలంటీర్ల ద్వారా నేరుగా లబ్థిదారులకు చేరుస్తామంటూ సీఎం జగన్ ప్రకటించటం తెలిసిందే. అయితే.. ఈ నిర్ణయంతో తమ ప్రయోజనాలు దెబ్బ తింటాయన్నది రేషన్ డీలర్ల సందేహంగా మారింది.ప్రభుత్వాధినేత చేసిన ప్రకటనను వక్రీకరిస్తూ విపక్షాలు కొత్త అనుమానాల్ని వ్యాపింపచేయటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డీలర్లు ఆందోళన చెందుతున్నారు. దీంతో.. వారంతా కలిసి సీఎం నివాసం ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. తాజా పరిణామాల నేపథ్యంలో కృష్ణా వారధి నుంచి వస్తున్న వారందరిని వెనక్కి పంపుతున్నారు. బాధ్యతగా వ్యవహరించాల్సిన విపక్షం అందుకు భిన్నంగా కొత్త సందేహాలు వ్యాప్తి చెందేలా.. ఆందోళనకు గురయ్యేలా చేయటం సరైన పని కాదంటున్నారు.