యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రాష్ట్ర విభజనకు ముందు నాటి పరిస్థితి ఎలా ఉన్నా.. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రుల బలమైన కోరిక విభజన కష్టాలతో అల్లాడుతున్న ఏపీకి `ప్రత్యేక హోదా` సాధించుకోవడమే..! నిజానికి పార్లమెంటులో ఈ ప్రస్థావన చేసే నాటికి కూడా ఏపీ ప్రజలు దీనిపై పెద్దగా దృష్టి పెట్టలేదు. రాష్ట్రం విడిపోకూడదనే కోరుకున్నారు అయితే, కారణాలు ఏవైనప్పటికీ… రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని లేని రాష్ట్రానికి, పారిశ్రామికంగా కుదేలైన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వల్ల ఏదైనా ఒరుగుతుందని, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రతి ఒక్క ఆంధ్రుడు ఆశించాడు. ఈ విషయంలో మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన రాజకీయ ఆశావాది పవన్ కల్యాణ‌్ కూడా హోదా కోసం ఎలుగెత్తారు.నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదా వద్దు.. ప్యాకేజీ ముద్దు అని ప్రకటించిన వెంటనే కాకినాడలో మీటింగ్ పెట్టిన పవన్ కల్యాణ్ ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో పోల్చి విమర్శించాడు. దీంతో ఆయన హోదాపై గట్టిగానే ఉన్నాడని అందరూ అనుకున్నారు. నిజానికి ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలోనూ ఆయన హోదా అవసరమనే చెప్పారు. పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏపీ ఎంపీలు ఒక్కతాటిపైకి వచ్చి మోడీ సర్కారుపై అసమ్మతి బాణాలు వేస్తే.. నేను కూడా ఢిల్లీ వేదికగా పార్టీలను కూడగట్టి మోడీ అంతు చూస్తానని ప్రకటించారు. దీంతో హోదాపై పవన్‌కు చాలానే చిత్త శుద్ధి ఉందని అందరూ అనుకున్నారు.కట్ చేస్తే.. తాజా ఎన్నికల్లో పవన్ నేతృత్వంలోని జనసేన పార్టీ పత్తాలేకుండా పోయింది. అయినా కూడా నిన్న మొన్నటి వరకు హోదాపై సానుకూలంగానే స్పందించిన పవన్ కల్యాణ్ ఇప్పుడు తాజాగా మాత్రం యూటర్న్ తీసుకున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. అమెరికాలో జరగుతున్న తెలుగు సంఘం తానా సమావేశాల్లో పాల్గొన్న ఆయనను ఓ మీడియా సంస్థ హోదా విషయంపై పలకరించి ప్రశ్నించినప్పుడు పవన్ చేసిన వ్యాఖ్యలుఅందరినీ విస్మయానికి గురి చేస్తున్నాయి. “హోదా పై అసలు ఏపీ ప్రజల్లో బలమైన ఆకాంక్ష ఉందా? నిజానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో అక్కడి ప్రజలకు బలమైన ఆకాంక్ష ఉన్నందునే అది సాకారమైంది“ అన్నారు.అంతటితో ఆగకుండా.. “ఏపీలో హోదా విషయానికి సంబంధించి ఆ తరహా బలమైన ఆకాంక్ష కనిపిస్తున్నట్టు లేదు. దీనిని బట్టి నేను ఫ్యూచర్ నిర్ణయించుకుంటాను“- అని పవన్ కల్యాణ‌్ చేసిన వ్యాఖ్యలను బట్టి దాదాపుగా ఆయన హోదా డిమాండ్ విషయంలో కాడి పడేసినట్టే భావించాల్సి వస్తోందని అంటున్నారు విశ్లేషకులు. నిజానికి కేంద్రంలోని బీజేపీ కూడా హోదా ఇవ్వబోమని స్ఫష్టం చేస్తున్న నేపథ్యంలో తానా సభల సమయంలో పవన్‌తో బీజేపీ నేతలు భేటీ కావడం వంటి పరిణామాలు , ఆ వెంటనే పవన్ ఈ విధంగా వ్యాఖ్యానించడాన్ని బట్టి హోదా విషయంలో పవన్ వెనుకడుగు వేశారని అంటున్నారు. మరి ఫ్యూచర్‌లో ఎలాంటి పరిణామలు చూడాల్సి ఉంటుందో చూడాలి .