అనంతపురం జిల్లా రాప్తాడు. పరిటాల రవీంద్ర కంచుకోట. పదేళ్లపాటు పరిటాల సునీత పసుపుకోట. ఓవరాల్‌గా అది పరిటాల కోట. అదే కోటలో, వారసత్వ ప్రవేశం చేశాడు పరిటాల శ్రీరాం. కానీ డెబ్యూ
ఎంట్రీలోనే దెబ్బతిన్నాడు. తండ్రిని, తల్లిని ఆదరించినంతగా కొడుకుగా అతనిపై అభిమానం చూపించలేకపోయారు జనం. దీంతో అతను ఓడిపోయారు. అందుకే అన్నట్టుగా ఇప్పుడా లీడర్, స్ట్రాటజీ
చేంజ్ చేయడం కాదు, ఏకంగా నియోజకవర్గాన్నే మార్చేద్దామన్న ఆలోచనలో ఉన్నారు. అందుకే మరో పరిటాల కోటపై మనసు పడ్డారు. ఇంతకీ పరిటాల శ్రీరాం మనసు పారేసుకుంటున్న మరో సెగ్మెంట్ ఏది సెగ్మెంట్ చేంజ్ వెనక చక్కర్లు కొడుతున్న స్టోరి ఏంటి?అనంతపురం జిల్లా ధర్మవరంలో మారుతున్న రాజకీయ పరిణామాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. నేతల పక్కచూపులు, మరో కీలక నేత ఇటువైపు చూస్తుండటంతో, అందరి దృష్టి ఇప్పుడు ధర్మవరంపై పడింది. గోనుగుంట్ల సూర్యనారాయణ. 2009లో ధర్మవరం నుంచి ఇంటిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత టీడీపీలోకి చేరి ఇన్చార్జిగా వ్యవహరించారు. 2014లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. నియోకజవర్గంలో నిత్యం తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉంటారన్న పేరు తెచ్చుకున్నారు. అయితే మొన్నటి ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఘోర పరాభవాన్ని చవిచూశారు. వైసీపీ అధికారంలోకి రావడం, ధర్మవరంలో వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గెలుపొందడంతో సూర్యనారాయణ భవిష్యత్తు ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. కొత్త ప్రభుత్వం కొలువుతీరి నెలరోజులు గడవక ముందే సూర్యనారాయణ ప్రతిపక్షంలో కొనసాగలేక పార్టీ మారారు. బీజేపీ జాతీయ
వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఆధ్వర్యంలో ఇటీవల బీజేపీలో చేరారు. సూర్యనారాయణ పార్టీ మార్పుతో, ఒక్కసారిగా ధర్మవరంలో సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా రాప్తాడులో ఓడిపోయిన పరిటాల శ్రీరాం, ధర్మవరం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తుండటం, పొలిటికల్ ఈక్వేషన్స్‌ను ఇంట్రెస్టింగ్‌గా మార్చేస్తున్నాయి. మొన్నటి ఎన్నికల్లో రాప్తాడు నుంచి పోటీ చేశారు పరిటాల శ్రీరాం. మొన్నటి వరకు తల్లి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో అన్నీ తానై వ్యవహరించారు. గెలుస్తానని పక్కాగా అనుకున్నారు. కానీ జగన్ సునామీలో నిలువలేకపోయారు. వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేతిలో, పాతికవేల ఓట్లతో ఓడిపోయారు. మొదటిసారి పోటీలోనే షాక్ తిన్నారు పరిటాల శ్రీరాం. ఎందుకంటే మొన్నటి వరకు రాప్తాడులో పరిటాల కుటుంబానికి ఎదురులేదు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు తల్లి పరిటాల సునీత. వారసునిగా బరిలోకి దిగిన శ్రీరామ్‌ను మాత్రం, ఎందుకనో జనం ఆదరించలేకపోయారు. ప్రస్తుతం ధర్మవరంవైపు పరిటాల శ్రీరాం చూడ్డానికి, రాప్తాడులో ఓటమే ఒక కారణంగా రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. నిజానికి పరిటాల శ్రీరాంకు మొదటి నుంచి ధర్మవరంపైనే మనసుంది. ఎందుకంటే
ధర్మవరంలో పరిటాల కుటుంబానికి మంచి పేరుంది. భారీ సంఖ్యలో అనుచరగణముంది. దీంతో ధర్మవరం నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందని కూడా ఆలోచించారు శ్రీరాం. కానీ రకరకాల సమీకరణలు, సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ బలంగానే ఉండటంతో, పరిటాల పేరును పెద్దగా ఆలోచించలేదు చంద్రబాబు. సూర్యనారాయణ ఓడిపోవడం, బీజేపీలోకి వెళ్లడంతో, ధర్మవరంలో శ్రీరామ్ ఎంట్రీకి లైన్ క్లియరైనట్టయ్యింది, కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి ధర్మవరం టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా తనను నియమించాలని చంద్రబాబును, శ్రీరాం కోరుతున్నారని తెలుస్తోంది. నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలు కూడా బలమైన నాయకుడు కావాలని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ధర్మవరం ఇన్‌ఛార్జ్‌గా శ్రీరాంను నియమించడం ఖాయంగా కనిపిస్తోంది. మరి శ్రీరాం ధర్మవరానికి వెళితే రాప్తాడు పరిస్థితి ఏంటి తల్లి సునీత తిరిగి అక్కడ తన పట్టు నిలుపుకునే ప్రయత్నం చేస్తారా ధర్మవరంలో కొడుకు, రాప్తాడులో తల్లి వచ్చే ఎన్నికల్లో నిలబడతారా అన్నది ఆసక్తికరంగా మారింది