యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా అన్ని సౌకర్యాలు కల్పించి, అమ్మఒడి పథకం ద్వారా ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డి చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కన్పించడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో సిబ్బంది, మౌలిక సదుపాయాల కొరత కారణంగా ప్రభుత్వ విద్యాకు పేద విద్యార్థులు దూరం అవుతున్నారు. ఇందుకు నిదర్శనమే కదిరి పట్టణంలోని నాగిరెడ్డిపల్లి మున్సిపల్ ప్రాథమిక పాఠశాల. ఈ పాఠశాలలో 1 నుంచి 8వ తరగతి వరకు 90మంది విద్యార్థులు విద్యాభ్యాసం కొనసాగి స్తున్నారు. గతంలో ఈపాఠశాలలో నలుగురు ఉపాధ్యా యులు విధులు నిర్వహించేవారు. వారిలో ఇద్దరు ఈ ఏడాది బదిలీపై వెళ్లారు. మరొకర స్టడీ సెలవులో ఉన్నారు. ఉన్న నలుగురిలో ముగ్గురు వెళ్లిపోవడంతో ప్రస్తుతం ఒక్కరూ 90 మంది విద్యార్థులకు పాఠాలు బోధించాల్సిన పరిస్థితి నెలకొంది. భవాణీ అనే ఉపాధ్యాయురాలు ఒక్కరే 1నుంచి 8వ తరగతి వరకు అన్ని సబ్జెక్టులకు పాఠాలు చెబుతున్నారు. ప్రధానోపాధ్యాయురాలి బాధ్యత ఆమెపై ఉండడంతో తరచూ ఎమ్మార్సీలో జరిగే సమావేశాలకు హాజరు కావాల్సి ఉంది. పాఠశాలలో ఉపాధ్యాయులు లేకపోవడం తో తల్లిదండ్రులు వారి పిల్లలను ఇతర పాఠశాలల్లో
చేర్పిస్తున్నారు. ఇప్పటికే 30మందికి టీసీలు తీసుకుని వెళ్లారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఈ పాఠశాలను మూసి వేయాల్సి ఉంటుంది.