YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆస్పత్రిలో జలగలు..!

 ఆస్పత్రిలో జలగలు..!

అనంతపురం : సర్వజనాస్పత్రిలో కొందరు సిబ్బంది.. సేవలకు రేటు కట్టారు. ఒక్కోసేవకు రేటు ఫిక్స్‌ చేసి ఇక్కడికొచ్చేవారి జేబులు ఖాళీ చేస్తున్నారు. పేదలమని డబ్బులివ్వకపోతే...నోటికి పని చెబుతారు. అందరిముందే దుర్భాషలాడుతూ పరుపుతీస్తారు. అందుకే ధర్మాస్పత్రికి వచ్చేందుకే జనం జంకుతున్నారు.  సర్వజనాస్పత్రిలోని గైనిక్, లేబర్‌ వార్డు సిబ్బంది (వైద్యులు, స్టాఫ్‌నర్సులు కాదు) తీరుతో ఇక్కడికి ప్రసవాలకు వచ్చే మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిబ్బంది అడిగినంత ఇవ్వకపోతే పురిటి నొప్పుల కంటే ఇక్కడి సిబ్బంది పెట్టే టార్చరే ఎక్కువగా ఉంటుందని గర్భిణీలు, బాలింతలు వాపోతున్నారు. బాలింతలకు ‘జనని సురక్ష యోజన’ కింద ప్రభుత్వం ఇచ్చే డబ్బు కన్నా ముందే సిబ్బందికి రూ.1,500 వరకు ముట్టజెప్పాల్సి వస్తోందంటున్నారు.
ప్రసవం అయ్యాక శిశువును శుభ్రం చేయాలంటే - రూ.500 ,బాలింతను స్ట్రెచ్చర్‌పై గైనిక్‌ వార్డుకు తీసుకొస్తే  రూ.100 , చీర మార్చినందుకు.. రూ 100 , కుట్లు శుభ్రం చేస్తున్నందుకు..రూ.50, కుట్లు విప్పేందుకు..రూ. 200 , వీల్‌చైర్‌లో అంబులెన్స్‌ వరకూ తీసుకెళ్తే.. రూ.100, ఇదేదో కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో సేవలకు చేసే చార్జ్‌ కాదు.. మన సర్వజనాస్పత్రిలోనే రోగుల నుంచి  సిబ్బంది ముక్కు పిండి వసూలు చేస్తున్న మొత్తం. అడిగినంత ఇవ్వకపోతే ఇక బూతులే. సర్వజనాస్పత్రికి వచ్చే వారంతా నిరుపేదలే. అందకూ కూలినాలి పనులు చేసుకునేవారే. అలాంటి వారినీ ఆస్పత్రిలోని లేబర్, గైనిక్‌ విభాగంలోని సిబ్బంది పీడిస్తున్నారు. ఆస్పత్రిలోని లేబర్‌వార్డులో రోజూ 30 నుంచి 40 ప్రసవాలు జరుగుతుండగా... వీటితో 10 నుంచి 12 సిజేరియన్లు ఉంటాయి. సిజేరియన్‌ అయిన వారి నుంచి సిబ్బంది భారీగా వసూలు చేస్తున్నారు. పైగా ఆమాత్రం ఇవ్వలేనోళ్లు కడుపెందుకు తెచ్చుకోవాలని నీచంగా మాట్లాడుతున్నట్లు గర్భిణులు వాపోతున్నారు.

Related Posts