యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:
దొరసాని
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా ‘దొరసాని’ అనే సినిమా వస్తోంది. డాక్టర్ రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మిక ఈ సినిమాలో హీరోయిన్. తెలంగాణలో 80వ దశకంలో దొరల కాలంలో జరిగిన ఒక నిజజీవిత ప్రేమకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ద్వారా కేవీఆర్ మహేంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సరేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో మధుర ఎంటర్‌టైన్మెంట్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. సినిమా కథ ఇప్పటి వరకు వచ్చిన చాలా ప్రేమకథా చిత్రాలను తలపిస్తోంది. కాకపోతే, అప్పటి దొరల కాలం, తెలంగాణ ప్రాంతం, యాస కొత్తగా కనిపిస్తున్నాయి. దొరసానిగా శివాత్మిక లుక్ చాలా బాగుంది. ఆమె కళ్లలో దర్పం, అందం, అభినయం ఆకట్టుకుంటున్నాయి. కానీ, హీరో ఆనంద్ దేవరకొండ మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. విజయ్ దేవరకొండ తమ్ముడు అనే ట్యాగ్‌తో వస్తుండటంతో ఆనంద్‌పై సాధారణంగా అంచనాలున్నాయి. కానీ, ఆ అంచనాలను ఆనంద్ అందుకోలేదనే చెప్పాలి.
‘రాజ్ దూత్
రియల్ స్టార్ శ్రీహరి కొడుకు మేఘాంష్ ‘రాజ్ దూత్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అర్జున్-కార్తీక్ దర్శక ద్వయం మేఘాంష్‌ని ఈ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. ఫస్ట్ లుక్, ప్రమోషన్ పోస్టర్‌తో తండ్రికి తగ్గతనయుడు అనిపించుకున్న మేఘాంష్ తాజాగా ఈ చిత్ర టీజర్‌తో సందడి చేస్తున్నాడు. ఈ టీజర్ విషయానికి వస్తే.. సునీల్ వాయిస్ ఓవర్‌తో ‘రాజ్ దూత్’ని ఇంట్రడ్యూస్ అయ్యాడు. టైటిల్‌కి తగ్గట్టే.. రాజ్ దూత్ బైక్ చుట్టూ ఈ కథను అల్లినట్టు టీజర్‌లో స్పష్ఠం చేశారు. విలన్ ఉండే ఊరిలో ఉన్న పాత రాజ్ దూత్ బైక్ కోసం హీరో వెతుక్కుంటూ వెళ్లడం.. ఆ బైక్ కోసం నానా తిప్పలు పడటం.. అక్కడే హీరోయిన్ పరిచయం కావడం మొత్తంగా ఈ కథలో హీరో ‘రాజ్ దూత్’ గా మారింది.
నిను వీడని నీడను నేనే
సందీప్ కిషన్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న సినిమా ‘నిను వీడని నీడను నేనే’. హారర్ థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ సినిమా టీజర్ అందరిని ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమాలోని తొలి పాటను విడుదల చేశారు. ఇది టైటిల్ సాంగ్. ఎస్.ఎస్.తమన్ స్వరపరిచిన ఈ మెలోడి అద్భుతంగా ఉంది. ఈ పాటకు నీరజ కోన సాహిత్యం అందించగా.. యాజిన్ నిజర్ ఆలపించారు. అయితే, లిరికల్ వీడియో మధ్యలో వచ్చే కొన్ని రొమాంటిక్ సీన్లు హీటు పెంచేస్తున్నాయి. సందీప్ కిషన్, అన్యా సింగ్ లిప్ లాక్ సీన్‌ను కూడా ఈ పాటలో పొందుపరిచారు. చిత్రంలో వెన్నెల కిషోర్, పోసాని క్రిష్ణమురళి, మురళీ శర్మ, పూర్ణిమ భాగ్యరాజ్, ప్రగతి, రాహుల్ రామక్రిష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం సమకూర్చారు. పీకే వర్మ సినిమాటోగ్రఫీ అందించారు.
మాయాబజార్’
ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించే సినిమాలు తక్కువ సంఖ్యలో ఉంటాయి. వాటిల్లో విజయా వారి ‘మాయాబజార్’ చిత్రానిది అగ్రస్థానం. 1957లో విడుదలై ఇప్పటికి 62 ఏళ్లు పూర్తి చేసుకొన్న ఈ చిత్రం టీవీల్లో వస్తోందంటే ఈనాటికీ ప్రత్యేక ఆసక్తి కనబర్చేవారు ఎందరో. ఎన్టీఆర్ శ్రీకృష్ణునిగా పూర్తిస్థాయి పాత్రలో వెండితెరపై తొలిసారిగా కనిపించింది ఈ చిత్రంలోనే. అలాగే అభిమన్యుని పాత్రలో ప్రేమికుడిగా, వీరాధివీరుడిగా అక్కినేని ‘మాయాబజార్’ చిత్రంలో నటించారు. బ్లాక్ అండ్ వైట్‌లో రూపుదిద్దుకొన్న ‘మాయాబజార్’ చిత్రాన్ని రంగుల్లోకి మార్చిన ఘనత గోల్డ్‌స్టోన్ సంస్థకు దక్కుతుంది. పాత చిత్రానికి రంగుల హంగులు అద్దడమే కాకుండా డీటీఎస్ మిక్సింగ్ చేసి 2010లో ఆ సంస్థ విడుదల చేసింది. మళ్లీ తొమ్మిదేళ్ల అనంతరం విజయవాడకు చెందిన దినేశ్ పిక్చర్స్ సంస్థ రంగుల ‘మాయాబజార్’ హక్కులు కొని, సినిమాను డిజిటలైజ్ చేసి, ఈ నెల 12న విడుదల చేస్తోంది.
మార్కెట్లో ప్రజాస్వామ్యం’
స్నేహచిత్ర పతాకంపై స్వీయదర్శకత్వంలో ఆర్. నారాయణమూర్తి నటించి, రూపొందించిన చిత్రం ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’ శుక్రవారం విడుదల కానుంది. గతంలో ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా మంచి నాయకుడిని తమకు అండదండలుగా ఉండే నాయకుడిని ఎన్నుకొనేవారు. తర్వాతి కాలంలో ఆ వాతావరణాన్ని పూర్తిగా నాశనం చేశారు కొత్త నాయకులు. ఎవరైతే నాయకుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడో అతనికి తను పోటీచేసే నియోజకవర్గం ఎల్లలు కూడా తెలియటం లేదు. కారణం వారు ఏదో ఒక వ్యాపారంలో కోట్లు గడించి రాజకీయాల్లోకి వస్తున్నారు. రాజకీయం అనేది సర్వీస్ మోటో, అది కాస్తా ఇప్పుడు బిజినెస్ మోటోగా మారిపోయింది. కోట్లు ఖర్చు పెట్టి మరీ రాజకీయాల్లోకి వస్తున్నారు. వారు పెట్టిన డబ్బును తిరిగి సంపాదించటానికి తప్పుదోవలో ప్రయాణిస్తున్నారు. అప్పుడు ఇది ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది. ధనస్వామ్యం అవుతుంది కానీ... అలా కాకూడదు అని చెప్పేదే నా ఈ ‘మార్కెట్‌లో ప్రజాస్వామ్యం’.
'కెఎస్100
చంద్రశేఖరా మూవీస్ పతాకంపై కె. వెంకట్‌రామ్‌రెడ్డి నిర్మాతగా మోడలింగ్ స్టార్స్ సమీర్ ఖాన్, సునీతా పాండే, శైలజా తివారి, ఆశిరాయ్, శ్రద్దా శర్మ, అక్షిత మాధవ్ హీరోహీరోయిన్‌లుగా షేర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ''కెఎస్100 ''.. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన రాగా ఇటీవల విడుదలైన ట్రైలర్,ఆడియో సినిమాపై మరిన్ని అంచనాలను పెంచింది. జూలై12న ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ కాబోతుంది.. సబ్జెక్టు పరంగా కొంత అడల్ట్ కంటెంట్ అయితే ఉంది కానీ.. కథ పరంగా వెళ్ళామే తప్ప మేము ఎక్కడా పరిధి దాటలేదు. అందుకనే సెన్సార్ వారు ఒక్క కట్ కూడా చెప్పలేదు. థియేటర్స్ నుండి రెస్పాన్స్ కూడా చాలా బాగుందంటున్నారు నిర్మాత.