జూలై 17వ తేదీ చంద్రగ్రహణం కారణంగా జూలై 16వ తేదీ రాత్రి 7 నుంచి మరుసటిరోజు తెల్లవారుజామున 5 గంటల వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం తలుపులు మూసివేస్తారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరడమైనది.
జూలై 17వ తేదీ బుధవారం ఉదయాత్పూర్వం 1.31 నుండి 4.29 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుంది. గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ. జూలై 17న ఉదయం 5 గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. అనంతరం తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. కాగా ఉదయం 11 గంటలకు సర్వదర్శనం ప్రారంభవుతుంది.
జూలై 16న కోయిల్ ఆళ్వారు తిరుమంజనం :
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 17న ఆణివార ఆస్థానం సందర్భంగా జూలై 16వ తేదీ మంగళవారంనాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అత్యంత వైభవంగా టిటిడి నిర్వహించనుంది. ఇందులో భాగంగా ఉదయం 6.00 నుండి 11.00 గంటల వరకు తిరుమంజనం కార్యక్రమం నిర్వహిస్తారు.
సర్వదర్శనం :
ఈ నేపథ్యంలో జూలై 16న ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సర్వదర్శనం ఉండదు. కావున జూలై 16న మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 5 గంటల వరకు కేవలం 5 గంటలు మాత్రమే భక్తులకు దర్శన సమయం ఉంటుంది.
ఈ కారణంగా జూలై 15వ తేదీ అర్ధరాత్రి 12.00 గంటల వరకు రద్దీని అనుసరించి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లలోనికి భక్తులను అనుమతిస్తారు. వీరికి జూలై 16న మధ్యాహ్నం 12.00 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు దర్శనం కల్పిస్తారు. జూలై 16వ తేదీ సమయాభావం కారణంగా భక్తులను వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోనికి అనుమతించరు. జూలై 17వ తేదీ బుధవారం ఉదయం 5.00 గంటల నుండి మాత్రమే సర్వదర్శనం భక్తులను వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోనికి అనుమతిస్తారు.
జూలై 16న దివ్యదర్శనం, సర్వదర్శనం టోకెన్ల రద్దు :
శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, చంద్రగ్రహణం కారణంగా జూలై 16న దివ్యదర్శనం, సర్వదర్శనం టోకెన్లను టిటిడి రద్దు చేసింది.
జూలై 16న తిరుమలలో అన్నప్రసాద వితరణ కేంద్రాలు మూత :
చంద్రగ్రహణం కారణంగా ఈ నెల 16వ తేదీ మంగళవారం రాత్రి 7.00 గంటల నుండి తిరుమలలో అన్నప్రసాదాల వితరణ వుండదు. తిరిగి జూలై 17వ తేదీ బుధవారం ఉదయం 9.00 గంటలకు అన్నప్రసాదాల పంపీణి పున: ప్రారంభమవుతుంది.
ఈ సందర్భంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, పిఏసి-2, విక్యూసి-2, అన్నప్రసాద వితరణ కేంద్రాలు, టిటిడి ఉద్యోగుల క్యాంటీన్, శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం, ఎస్వీ విశ్రాంతి భవనాలలో అన్నప్రసాదాల వితరణ ఉండదు.
భక్తుల సౌకర్యార్థం ముదస్తుగా టిటిడి అన్నప్రసాదం విభాగం ఆధ్వర్యంలో 20 వేల పులిహోర, టమోట అన్నం ప్యాకెట్లను జూలై 16వ తేదీ సాయంత్రం 3.00 నుండి రాత్రి 7.00 గంటల వరకు పంపీణి చేయనున్నారు. ఇందులో భాగంగా తిరుమలలోని అన్నప్రసాద వితరణ కేంద్రాలు, నాదనీరాజనం వేదిక, మ్యూజియం వద్ద, వైభవోత్సవ మండపం ప్రాంగణంలో భక్తులకు అన్నప్రసాదం ప్యాకెట్లను అందిస్తారు.
జూలై 16, 17వ తేదీల్లో ఆర్జితసేవలు రద్దు :
జూలై 16న మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంతోపాటు చంద్రగ్రహణం కారణంగా అష్టదళ పాదపద్మారాధన, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దయ్యాయి. అదేవిధంగా జూలై 17న ఆణివార ఆస్థానం కారణంగా కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.
జూలై 16న పౌర్ణమి గరుడుసేవ రద్దు :
ఈ నెల 16వ తేది మంగళవారం నిర్వహించవలసిన పౌర్ణమి గరుడసేవను చంద్రగ్రహణం కారణంగా టిటిడి రద్దు చేసింది.