యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. ఏపీలో కరువుపై చర్చలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు సవాల్ విసిరారు. రైతుల కోసం సున్నా వడ్డీ పథకాన్ని తీసుకొచ్చినట్టు జగన్ ప్రకటించగా.. ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు మాట్లాడుతూ.. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో సున్నా వడ్డీకే రుణం పథకం ఉందని దానిని టీడీపీ ప్రభుత్వం కొనసాగించినట్లు చెప్పుకొచ్చారు.అయితే దీనిపై సీఎం స్పందిస్తూ 2014-19 వరకు చంద్రబాబునాయుడి హయాంలో సున్నా వడ్డీకి ఎన్ని నిధులు రుణం ఇచ్చారో చెప్పాలని సవాల్ విసిరారు. 2014 నుంచి 19 వరకు ఎలాంటి సున్నా వడ్డీ రుణాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఇవ్వలేదని రికార్డులు స్పష్టం చేస్తే చంద్రబాబు రాజీనామా చేసి వెళ్లిపోతారా? అంటూ జగన్ మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. రాజేంద్రనాథ్ సమాధానం తర్వాత ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. 2014-2019 వరకు రాష్ట్ర రైతాంగానికి టీడీపీ ప్రభుత్వం సున్నా వడ్డీ పథకంపై రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. రికార్డులు అసెంబ్లీకి తీసుకొస్తామన్నారు. ఎంత డబ్బు ఇచ్చారో చంద్రబాబు చెప్పాలని సవాల్ విసిరారు. సున్నా వడ్డీకి రుణాలు ఇవ్వని విషయాన్ని రుజువు చేస్తే చంద్రబాబు తన పదవికి రాజీనామా చేస్తారా అంటూ సవాల్ విసిరారు. కేటాయింపుల్లో మాత్రం రూ.172 కోట్లు కనిపిస్తాయి.. కానీ ఖర్చు మాత్ర సున్నా అంటూ ఎద్దేవా చేశారు. 2018-19 రైతు రుణాల లెక్కల ప్రకారం.. సున్నా వడ్డీ పథకానికి ప్రభుత్వం రూ.3,068 కోట్లు ఇవ్వాలని.. ఐదేళ్లకు రూ.15 వేల కోట్లు ఇవ్వాలని గుర్తు చేశారు. కానీ గత ప్రభుత్వం రైతులను కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు కాబట్టి విపక్షంలో కూర్చున్నారని సెటైర్లు పేల్చారు. జగన్ వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేత చంద్రబాబు అభ్యంతర తెలిపారు. ఎవరి విధానాలు వారికి ఉంటాయి.. ప్రభుత్వంలో ఉన్నప్పుడు హుందాతనంతో మాట్లాడాలన్నారు. ఇష్టారీతిన అసత్యాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కనీసం వయసుకు గౌరవం ఇవ్వకుండా మాట్లాడుతున్నారని.. అడుగడుగునా అవమానిస్తున్నారని.. ఇది మంచి పద్దతి కాదన్నారు. సున్నా వడ్డీకి రుణాలు ఇవ్వడంలో తప్పులేదు కాని టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శించడమేంటన్నారు. రాష్ట్రంలో రైతులకు విత్తనాలు ఇవ్వలేని పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని చంద్రబాబు విమర్శించారు. విత్తనాలు కూడా ఇవ్వలేని జగన్ ఈ ఐదేళ్లలో ఏం చేస్తారని.. టీడీపీ హయాంలో వ్యవసాయంలో దేశంలోనే ఏపీ నెంబర్ వన్‌గా ఉందన్నారు. విపక్షనేతగా ఉన్న జగన్ మమ్మల్ని ఎన్నిసార్లు అభినందించారని ప్రశ్నించారు. ఎవరికైనా అధికారులే రికార్డులు ఇస్తారు.. అధికారులు రికార్డులు ఇవ్వకుంటే జగన్ చెప్పే పరిస్థితుల్లో లేవన్నారు.జగన్ సంధించిన సవాల్‌పై వెంటనే స్పందించిన చంద్రబాబు.. సెక్రెటరీ రాసిస్తే మీరు చదువుతారని, వెటకారం చేస్తూ.. ఎగతాళిగా మాటలు అనడం కరెక్ట్ కాదని అన్నారు. ఒక్కో ప్రభుత్వానికి ఒక్కో పాలసీ ఉంటుందని, గత ప్రభుత్వం కంటే మెరుగ్గా చేస్తే మంచిదని, అలా చేసి ప్రజలకు చెప్పుకోవచ్చని అన్నారు. లెక్కలు అనేవి ఎవరు పడితే వారు రాసుకునేందుకు వీలుండదని అన్నారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో ఏపీ నెంబర్ వన్‌గా ఉందంటే టీడీపీ ప్రభుత్వం వలనే అని చెప్పారు.ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హుందాగా వ్యవహరించాలని చంద్రబాబు.. జగన్ మోహన్ రెడ్డికి సూచించారు. ఎవరి విధానాలు వారికి ఉంటాయని, ప్రభుత్వంలో ఉన్నప్పుడు హుందాగా మాట్లాడాలని అన్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం కరెక్ట్ కాదని, కనీసం వయసుకు గౌరవం ఇవ్వకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అడుగడుగునా అవమానిస్తున్నారని మండిపడ్డారు.