యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై రాష్ట్రపతికి టీడీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో ఆయన్ను ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించిందని.. లాభదాయక పదవిలో ఉన్న వ్యక్తి రాజ్యసభ సభ్యత్వానికి అనర్హుడంటోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 102 ప్రకారం లాభదాయక పదవి చేపడితే రాజ్యసభ సీటుకు అనర్హుడవుతారని గుర్తు చేశారు. ఆఫీస్ ఆఫ్ ప్రాపర్టీ కింద విజయసాయి రాజ్యసభ సభ్యత్వం వదులుకోవాలని ఫిర్యాదులో ప్రస్తావించారు. ఏపీ ప్రభుత్వం జూన్‌లోనే విజయసాయిని ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించిందని.. ఆయనపై అనర్హత వేటు పడుతుందని జులై 4న ఆ జీవో రద్దు చేసిందని గుర్తు చేశారు. ఆయన్ను పదవిలో నియమించడం రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందంటున్నారు ఎంపీలు. రాష్ట్రపతితో పాటూ ఎన్నికల సంఘానికి ఎంపీలు ఈ మేరకు లేఖ రాశారు. త్వరలోనే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేయనున్నారు. జూన్ 22న విజయసాయిరెడ్డిని కేబినెట్ ర్యాంకుతో ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ మరో లాభదాయక పదవి (ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్) చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని తేలడంతో.. విజయసాయిరెడ్డి నియామకాన్ని ఈనెల 4న రద్దు చేశారు. ప్రత్యేక ప్రతినిధిగా ఎలాంటి జీత భత్యాలు, కేబినెట్ హోదా లేకుండానియమించేందుకు వీలుగా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధనల్లో సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఆర్డినెన్స్ జారీ చేసిందట. ఆర్డినెన్స్‌పై గవర్నర్ సంతకం చేయడంతో తాజాగా నియామకం జరిగిందట. ఉత్తర్వులు తక్షణం అమల్లోకి రానున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది