ఇటీవలే గన్నవరం విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు విమాన సేవలు రద్దయింది. వయబులిటీ గ్యాప్ ఫండ్ పేరిట.. నష్టాలను భరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ససేమిరా అనడంతో.. ఇండిగో సంస్థ సింగపూర్‌కు విమానాలను రద్దు చేసింది. ఇది గన్నవరం నుంచి ఉన్న ఒకే ఒక్క ఇంటర్నేషనల్ సర్వీస్. ఇండిగో నిర్ణయంతో.. అంతర్జాతీయ విమానాశ్రయం హోదా పేరుకు మాత్రమే పరిమితమైంది. రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి ఈ ఎయిర్ పోర్టు ఇక దేశీయ ఎయిర్ పోర్టుగా మాత్రమే మిగిలిపోనుంది. మరోవైపు ఎయిరిండియా సహా మిగిలిన ఎయిర్ లైన్స్ సంస్థలు తమ సర్వీసులను గన్నవరం విమానాశ్రయం నుంచి రద్దు చేస్తున్నాయి. బాబు అధికారంలో ఉన్నప్పుడు గన్నవరం, సింగపూర్ మధ్య విమాన సర్వీసులు నడిచేలా చేశారు. అందుకోసం వయబులిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) పేరిట సీట్లు ఫుల్ కాకపోతే ఆ నష్టాలను తాము భరించేలా.. ఎయిర్ పోర్టులో విమానం నిలిపి ఉంచేందుకు హ్యాంగర్ చార్జెస్ కూడా ప్రభుత్వమే భరించేలా ఒప్పందం చేసుకున్నారు. సింగపూర్ విమాన సర్వీసులు రద్దయిన తర్వాత.. ఈ సర్వీసులు నడపటానికి నెలకు రూ.3 కోట్లు ప్రభుత్వ భరించాల్సి వస్తోందని వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సింగపూర్ విమానాలు నడపటం వల్ల గన్నవరం ఎయిర్ పోర్టుకు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు హోదా వచ్చింది. అందుకే కేంద్ర విమానయాన సంస్థ బెజవాడ ఎయిర్ పోర్టుకు అదనపు సౌకర్యాలు కల్పించింది. అందులో భాగంగా కస్టమ్స్, సీఐఎస్‌ఎఫ్‌లను కేటాయించింది. అలాగే అదనపు నిధులు కేటాయించింది. ఎయిర్ పోర్టుకు విస్తరణకు నిధులు కేటాయించింది. బోయింగ్ 350 కూడా దిగేందుకు వీలుగా భారీ రన్ వే నిర్మించారు. తాజాగా సింగపూర్‌కి విమానాలు నిలిచిపోవడంతోపాటు ఇతర దేశాలకు వెళ్లే విమానాలు ఏవీ లేకపోవడంతో కస్టమ్స్, సీఐఎస్‌ఎఫ్‌ను కేంద్రం ఉపసంహరించుకుంది. రాష్ట్రవిభజనకు ముందు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి విమాన సర్వీసులు చాలా తక్కువగా ఉండేవి. కానీ అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత జనాల రాకపోకలు పెరిగాయి. తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ నిర్మాణం, ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా ఇక్కడి నుంచే పనిచేయడం, ఇతర పనుల కోసం వచ్చేవారితో అమరావతికి రాకపోకలు పెరిగాయి. ఎయిర్ లైన్స్ సంస్థలు విమాన సర్వీసులు పెంచాయి. ఆక్యుపెన్సీ కూడా పెరిగింది. ట్రూజెట్ లాంటి విమాన సంస్థలు సర్వీసులను ప్రారంభించాయి. స్పైస్ జెట్, ఇండిగో లాంటి సంస్థలు గన్నవరం నుంచి ఫస్ట్ ట్రిప్ వేసేలా ఇక్కడే విమానాలను పార్క్ చేసి ఉంచుతున్నాయి. ఇక్కడి నుంచి హైదరాబాద్, తిరుపతి, ముంబయి, బెంగళూరు, ఢిల్లీ, వైజాగ్‌కు రద్దీ పెరిగింది. కానీ ప్రస్తుతం సీన్ రివర్స్ అవుతోంది. స్పైస్ జెట్ విజయవాడ నుంచి తిరుపతి మీదుగా కొచ్చి సర్వీస్‌ను రద్దు చేయాలని భావిస్తోంది. వైజాగ్‌కు వెళ్లే రెండు విమానాలను ఎయిర్ఇండియా నిలిపివేసింది. హైదరాబాద్ మీదుగా ఢిల్లీ వెళ్లే విమాన సర్వీసును నిలిపివేసింది. బెంగళూరు సర్వీస్‌ని రద్దు చేసింంది. ఇండిగో కూడా తన సర్వీసులపై పునరాలోచిస్తోంది.