YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బాలారిష్టాలు దాటని గొల్లపూడి హోల్ సేల్ మార్కెట్

బాలారిష్టాలు దాటని గొల్లపూడి హోల్ సేల్ మార్కెట్

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

పేరుకు తగ్గట్లే అక్కడ అంతా హోల్‌సేల్‌గా కమర్షియలే. ఫక్తు వ్యాపార ధోరణే తప్ప వారికి మరో ధ్యాస ఉండదు. షాపులు తీశామా.. వ్యాపారం చేశామా.. నాలుగు డబ్బులు సంపాదించుకున్నామా.. అంతే. తమ సంక్షేమం కోసం ఒక సొసైటీ ఏర్పాటు చేసుకున్న వ్యాపారులు వారి దగ్గర పనిచేసే ముఠా కార్మికుల సంక్షేమాన్ని మాత్రం గాలికి వదిలేశారు. పైగా కూలి రేట్లు పెంచాలని పోరాడక తప్పని దుస్థితి కార్మికులది. ముఠా పని చేసేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగి గాయాలపాలైతే కనీసం ప్రాథమిక వైద్య సౌకర్యం కల్పించని పరిస్థితి ఉంది. ఇదీ గొల్లపూడి గ్రామ పరిధిలోని మహాత్మా గాంధీ హోల్‌సేల్‌ కమర్షియల్‌ కాంప్లెక్స్‌లో పనిచేసే ముఠా కూలీల దయనీయ స్థితి. అన్ని రకాల వ్యాపారాలకు సంబంధించిన సంఘాలకు నాయకుడిగా వెలుగొందిన దివంగత గడ్డం సుబ్బారావు హోల్‌సేల్‌ వ్యాపారుల కోసం 2003లో గొల్లపూడిలో కమర్షియల్‌ కాంప్లెక్స్‌నిర్మించారు. ఈ కాంప్లెక్స్‌లో 489 షాపులు ఉన్నాయి. ప్రతి రోజూ కోట్లాది రూపాయాల వ్యాపారం జరుగుతుంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే సరుకు దిగుమతి, ఇక్కడి నుంచి వేరేచోటకు పంపించే సరుకు ఎగుమతి చేసే ముఠా కూలీలు సుమారు 1,500 మందికిపైనే ఉన్నారు.కాంప్లెక్స్‌ నిర్మాణ సమయంలో నిబంధనల మేరకు 10 శాతం చొప్పున రెండు కామన్‌ సైట్లను వదిలారు. ముఠా కూలీల కోసం ఒక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసే సదుద్దేశ్యంతో కాంప్లెక్స్‌ నిర్మాణ సారధి గడ్డం సుబ్బారావు ఓ స్థలాన్ని కేటాయించి శంకుస్థాపన చేశారు. ఆయన చనిపోయిన తర్వాత దాని గురించి పట్టించుకున్న నాధుడు లేడు. కొన్నేళ్లుగా ఆ స్థలాన్ని వ్యాపారులు డంపింగ్‌ యార్డ్‌గా వాడుకుంటున్నారు. కాంప్లెక్స్‌ వైభవం అంతా గడ్డం సుబ్బారావుగారితోనే పోయిందని అక్కడ పనిచేసే ముఠా కూలీలు చెబుతున్నారు. సరుకుల ఎగుమతి, దిగుమతి సమయాల్లో ప్రమాదం జరిగితే వెంటనే ప్రథమ చికిత్స చేయించుకునే సౌకర్యం కాంప్లెక్స్‌లో లేదు. తమ కోసం ఓ హాస్పటల్‌ నిర్మించాలని అప్పట్లో సుబ్బారావు కాంప్లెక్స్‌లో స్థలం కేటాయించి శంకుస్థాపన కూడా చేశారు. ఆయన పోవటంతో అదికాస్తా మూలనపడింది. అయితే, యజమానులంతా కలిసి తమ సంక్షేమం కోసం విజయవాడ హోల్‌సేల్‌ కమర్షియల్‌ కాంప్లెక్స్‌ మెంబర్స్‌ వెల్ఫేర్‌ సొసైటీని ఏర్పాటు చేసుకున్నారుగానీ, వారి దగ్గర పని చేస్తున్న తమ సంక్షేమం కోసం ఎటువంటి ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఠా కార్మికులు. మధ్యాహ్నం భోజనం చేశాక కాసేపు విశ్రాంతి తీసుకుందామంటే ఒక్క షెడ్‌ కూడా లేదు. దీంతో చెట్ల కిందో, షాపుల్లోనో సేద తీరుతున్నామని వాపోతున్నారు.గొల్లపూడి పంచాయతీకి తాము ఏటా రూ.9 లక్షలకుపైనే పన్నులు చెల్లిస్తున్నా అధికారులు సహకరించటం లేదని సొసైటీ అధ్యక్షుడు అన్నవరపు కోటేశ్వరరావు చెప్పుకొస్తున్నారు. కాంప్లెక్స్‌లోని చెత్తా చెదారాన్ని పంచాయతీ సిబ్బంది తీసుకువెళ్లకపోవడంతో హాస్పటల్‌ కోసం కేటాయించిన స్థలంలో వేసుకోవాల్సి వస్తోందని అంటున్నారు. తామే ట్రాక్టర్‌ కొనుగోలు చేసుకుంటామని, చెత్త డంప్‌ చేసే ప్రదేశాన్ని చూపమని అడిగినా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. కాగా కాంప్లెక్స్‌లోని ఒక్కో షాపు నుంచి మెయింటినెన్స్‌ పేరుతో సొసైటీ రూ.1,600 వసూలు చేస్తుంది. ఆ షాపుపై మొదటి అంతస్తు ఉంటే మరో రూ.600 చార్జి చేస్తున్నారు. ఈ రకంగా సొసైటీకి నెలకు దాదాపు రూ.10 లక్షల వరకు వస్తుంది. అయితే కాంప్లెక్స్‌ మెయింటినెన్స్‌ అధ్వానంగా ఉంటుందని, లారీలు ఎక్కడపడితే అక్కడ పార్క్‌ చేయడం, రోడ్డుపైనే ఎగుమతి దిగుమతులు చేయడంతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని వినియోగదారులు చెబుతున్నారు.

Related Posts