యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
శుక్రవారం నాడు ఏపీ శాసనసభ వాడివాడిగా నడిచింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర గందరగోళం నెలకొనడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది శాసనసభా? లేకపోతే ఫిష్ మార్కెటా? అంటూ వ్యాఖ్యానించారు. సభను పాండెమోనియం చేస్తూ చర్చ జరుగనీయకపోతే ఎలా అని ప్రశ్నించారు. ?తెలుగుదేశం సభ్యులు మాట్లాడుతున్న సమయంలో అధికారపక్షం మౌనంగా ఉందని, అధికారపక్షం మాట్లాడుతుంటే మాత్రం విపక్ష ఎమ్మెల్యేలు గొడవ చేస్తున్నారని అయన అసహనాన్ని వ్యక్తం చేశారు. సభ ఆర్డర్ తప్పుతున్న వేళ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదేమీ ఫిష్ మార్కెట్ కాదని, ప్రజలు, మీడియా సభ్యులు చూస్తున్నారని అన్నారు. శుక్రవారం అసెంబ్లి ప్రారంభం కాగానే సభలో కరవుపై చర్చకు తమకు అవకాశం ఇవ్వాలని టిడిపి సభ్యులు పట్టుబట్టారు. దీనితో సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. సున్నా వడ్డీ రుణాలపై సిఎం తప్పుడు ప్రకటన చేశారని వారు ఆరోపించారు. తప్పుడు సమాచారంతో ముఖ్యమంత్రి జగన్ సభలో సవాల్ చేశారని టిడిపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ముఖ్యమంత్రి మాట్లాడారని టిడిపి ఎమ్మెల్యే రామానాయుడు అన్నారు. తరువాత టీడీపీ సభ్యులు సభలో అందోళనకు దిగారు. తమ్మినేని మాట్లాడుతూ ముఖ్యమంత్రి, విపక్ష నేత మాట్లాడేవేళ, వారికి ఎవరూ అడ్డుతగల వద్దని కోరారు. సభను తాను హుందాగా నడిపించాలని కోరుకుంటున్నానని, అందుకు ప్రతి
ఒక్కరూ సహకరించాలని తమ్మినేని వ్యాఖ్యానించారు. అంతకుముందు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి మాట్లాడుతూ, సీఎం జగన్ మాట్లాడితే, ప్రజల ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుందన్న భయంతోనే తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఆందోళన చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ సభ్యులు కంట్రోల్ తప్పరాదని, వారు హద్దులు దాటితే మాత్రం చూస్తూ ఊరుకోబోయేది లేదని అన్నారు.