యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవి అచ్చిరానట్లుంది. గతంలో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని ముఖ్యమంత్రి గా పూర్తికాలం కొనసాగలేకపోయారు. మరోసారి మళ్లీ కాంగ్రెస్ తో జత కట్టి ముఖ్యమంత్రి పదవికి దూరం అయ్యే ప్రమాదం పొంచి ఉంది. కుమారస్వామి తండ్రి చాటున రాజకీయంగా ఎదిగిన నేత. జనతాదళ్ ఎస్ ను స్థాపించిన దేవెగౌడ పార్టీని కన్నడ నాట పూర్తి స్థాయిలో పటిష్టం చేశారు. పార్టీపై ఒక కులం ముద్ర పడినా కొన్ని ప్రాంతాలకే జనతాదళ్ ఎస్ పరిమితమయింది.దేవెగౌడ స్థాపించిన జనతాదళ్ ఎస్ కుటుంబ పార్టీగా మిగిలిపోయిందనే చెప్పాలి. రాజకీయంగా పెద్దగా చైతన్యం లేని సమయంలో కుటుంబ పాలనను ప్రజలు స్వాగతించారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం, రాజకీయాలపై ప్రజల్లో ఆసక్తి పెరగడం వంటి కారణాలతో జనతాదళ్ ఎస్ కొంత ఇబ్బంది పడుతోంది. దేవెగౌడ మాజీ ప్రధాని అయిన తర్వాత పార్టీపై పెద్దగా దృష్టి పెట్టకుండా కుమారస్వామిపైనే భారం మోపారు. కుమారస్వామికి మాత్రం రాజకీయం కన్నా ఎక్కువగా మఠాలు, మందిరాలకే పరిమితమవుతున్నారు. తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తన కుమారుడు నిఖిల్ గౌడను గెలిపించుకోలేక కుమారస్వామి ఎమ్మెల్యేల ముందు బలహీనమయ్యారు. కుమారస్వామి సంకీర్ణ సర్కార్ లో ఉన్నామన్న స్పృహ లేకుండా వ్యవహరించడం వల్లనే ఈ పరిస్థితి దాపురించిందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. కేవలం పరమేశ్వర, డీకే శివకుమార్ వంటి వారికే ప్రాధాన్యత కుమారస్వామి ఇచ్చేవారని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పట్టించుకునే వారు కారన్న విమర్శలు కూడా ఉన్నాయి.అందుకే జరుగుతున్న పరిణామాలను చూసి మౌనంగా ఉండటం తప్ప కుమారస్వామి చేయగలిగింది ఏమీ లేదన్నది అర్థమై పోయింది. అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించే ప్రయత్నానికి కూడా కుమారస్వామి దిగలేదు. కుమారస్వామి పై ఆగ్రహం కొంత, కాంగ్రెస్ హైకమాండ్ వ్యవహారశైలి నచ్చక మరికొంత ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారన్నది వాస్తవం. మొత్తం మీద కుమారస్వామి చేజేతులా తన ప్రభుత్వానికి కష్టాలు కొని తెచ్చుకున్నారన్నది వాస్తవం.