యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కర్ణాటక రాజకీయ సంక్షోభం రోజు రోజు కు మలుపులు తిరుగుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో శాసనసభలో తన బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నానని సీఎం కుమారస్వామి స్పష్టం చేశారు. బలపరీక్షకు సమయం ఖరారు చేయాలని స్పీకర్ రమేశ్ కుమార్‌ను కోరారు. దీంతో ఒక్కసారిగా కర్ణాటక సంక్షోభం కీలక మలుపు తిరిగినట్లయింది. బలపరీక్షకు స్పీకర్ ఎప్పుడు సమయమిస్తారన్నది ఉత్కంఠగా మారింది. రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలు, అనర్హత వేటుపై యథాతథస్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన కొద్ది క్షణాలకే కుమారస్వామి బలపరీక్షకు సిద్ధమవడం ప్రాధాన్యత సంతరించుకుంది.‘ఎమ్మెల్యేల రాజీనామాలపై రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో రాష్ట్రంలో క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో నేను అధికారంలో ఉండలేను. అయితే నాకు ఎమ్మెల్యేల మద్దతు ఉంది. దాన్ని రుజువు చేసుకుంటా. తాజా పరిణామాల నేపథ్యంలో బలపరీక్షకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నా. ఇందుకు సమయాన్ని ఖరారు చేయండి’ అని సీఎం కుమారస్వామి అసెంబ్లీలో తెలిపారు. కర్ణాటకలో మొత్తం 224 మంది ఎమ్మెల్యేలున్నారు. వీరిలో 16 మంది రాజీనామాలు చేశారు. అయితే వీరి రాజీనామాలను స్పీకర్ ఇప్పుడు అంగీకరించకూడదు గనుక మంగళవారం వరకు ఎమ్మెల్యేలుగానే ఉంటారు. శాసనసభలో భాజపా సంఖ్యా బలం 107, రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను తీసేస్తే సంకీర్ణం సంఖ్యా బలం 100. ఇలాంటి సమయంలో బలపరీక్షలో కుమారస్వామి నెగ్గుతారో లేదో వేచి చూడాలి.