యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
సున్నా వడ్డీకే రుణాల అంశంపై ఏపీ అసెంబ్లీని కుదిపేసింది. అధికార-ప్రతిపక్షాల మధ్య వాగ్వాదానికి దారి తీసింది. కొద్దిసేపటికే సభ వాయిదా పడగా.. వైఎస్ జగన్ సభలో చేసిన వ్యాఖ్యలకు టీడీపీ సభ్యులు మీడియా పాయింట్‌లో కౌంటరిచ్చారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి హుందాగా మాట్లాడాలన్నారు టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు. సభలో అబద్దాలు చెబుతూ.. ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. జగన్ మాట మీద నిలబడే నాయకుడైతే.. 5కోట్లమంది ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు అచ్చెన్న. సభలో ఏం జరుగుతుందో జగన్‌కు తెలియదని.. వారు ఛాలెంజ్ చేశారు కాబట్టి తాము క్షమాపణ చెప్పాలని అడుగుతున్నామన్నారు. ముఖ్యమంత్రి రాజీనామా చేయమని తాము కోరడం లేదన్నారు. సున్నా వడ్డీకే రుణాలు.. రైతులకు చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని జగన్ సభలో అన్నారని.. ఏ సంవత్సరంలో ఎంత ఇచ్చామో అంకెలతో సహా చెప్పామని గుర్తు చేశారు అచ్చెన్నాయడు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ డబ్బు చెల్లించామన్నారు అచ్చెన్నాయుడు. 3 విడతలుగా రుణమాఫీ చేశామని.. చివరి రెండు విడతలు కూడా డబ్బులు విడుదల చేయాలని చెప్పామన్నారు. బడ్జెట్‌లో కూడా పెట్టామని అచ్చెన్న గుర్తు చేశారు. సున్నా వడ్డీకే రుణాల విషయంలో జగన్ అబద్దాలు చెప్పారని.. సీఎంకు కూడా బుద్ధి పెరగాలని ఘాటు వ్యాఖ్యాలు చేశారు. ముఖ్యమంత్రిగా జగన్ కూడా హుందాతనంగా వ్యవహరించాలని సలహా ఇచ్చారు అచ్చెన్న. ప్రతిపక్షాన్ని గౌరవించడం సీఎం నేర్చుకోవాలని.. వెటకారంగా మాట్లాడడం, చెయ్యి ఎత్తడం మంచి పద్దతి కాదన్నారు. తాము తలచుకుంటే మీరు ఉండరంటూ జగన్ చేసిన వ్యాఖ్యల్ని అచ్చెన్నాయుడు ప్రస్తావించారు. ముఖ్యమంత్రి ఇలా అనడం ధర్మమా అంటూ ప్రశ్నించారు.