Highlights
నేడో రేపో బదిలీ ఉత్తర్వులు.. !
జిల్లాల ఎస్పీలకి స్దాన చలనం
తెలంగాణ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఐపీఎస్ అధికారుల బదిలీలకు ప్రభుత్వం సంనార్ధమైనట్టుగా తెలుస్తుంది.
ఈ విషయంలో పోలీసు వర్గాలు సైతం అవుననే అంటున్నాయి. హైదరాబాద్ నగర కమిషనర్ సహా ఇతర కీలక స్థానాల్లో బదిలీలుంటాయని అంటున్నారు. మహేందర్‌రెడ్డి డీజీపీగా నియమితులవడంతో గత నవంబర్ నుంచి నగర కమిషనర్ బాధ్యతలను అదనపు కమిషనర్ శ్రీనివాస్‌రావు పర్యవేక్షిస్తున్నారు. ఈ స్థానంలో పోలీసు అకాడమీ డైరెక్టర్ జితేందర్‌ను నియమించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. అదే పోస్టుకు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న అంజనీకుమార్‌ను సీఐడీ అదనపు డీజీపీగా, అదనపు కమిషనర్ స్వాతి లక్రాను సైబరాబాద్ కమిషనర్‌గా, హోంశాఖ కార్యదర్శిగా గోపికృష్ణ లేదా గోవింద్‌సింగ్‌ను, పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా సందీప్ శాండిల్యాను నియమించే అవకాశం ఉందని తెలిసింది.
ఎస్పిలెక్కడంటే..
అన్ని జిల్లాల ఎస్పీలకి స్దాన చలనం తప్పదంటున్నారు. వరంగల్ కమిషనర్ సుధీర్‌బాబును హైదరాబాద్ రేంజ్ డీఐజీగా బదిలీ చేస్తారని, ఆ స్థానంలో రవివర్మ లేదా ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ రవీందర్‌ను నియమిస్తారని సమాచారం. రీజియన్ ఐజీలు నాగిరెడ్డి, స్టీఫెన్ రవీంద్రలనూ కీలక విభాగాలకు బదిలీ చేయనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ శాంతి భద్రతల అదనపు సీపీగా పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ ఎండీ మల్లారెడ్డిని, హౌజింగ్ ఎండీగా అదనపు డీజీపీ సంతోష్‌మెహ్రాను, డీఎస్ చౌహాన్‌ను వరంగల్ కమిషనర్‌గా, అనిల్‌ను నార్త్‌జోన్ ఐజీగా నియమించనున్నట్లు సమాచారం. శాంతి భద్రతల అదనపు డీజీపీ పోస్టులో ఐజీ ర్యాంకు అధికారిని నియమించనున్నారు. జాబితా కొలిక్కి వచ్చిందని, 49 మంది అధికారులతో కూడిన బదిలీ జాబితా 2 రోజుల్లో వెలువడే అవకాశం ఉందని సమాచారం.