యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఏపీ రాజకీయాల్లో పాగా వేసేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్న బీజేపీ... ఇందుకోసం ముందుగా టీడీపీని టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. ముందుగా టీడీపీలోని బలమైన నాయకులను, ఆ పార్టీ క్యాడర్‌ను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ... ఈ క్రమంలో కొంతవరకు సక్సెస్ సాధించిందనే చెప్పాలి. టీడీపీ నేతలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలను కొనసాగిస్తున్న కమలనాథులు... ప్రస్తుతం అధికార వైసీపీ జోలికి మాత్రం వెళ్లడం లేదు. కేంద్రంలో తమతో సఖ్యతగా ఉంటున్న వైసీపీని ఏపీలో బీజేపీ నేతలు విమర్శించడం లేదు. అయితే టీడీపీని బలహీనపరిచిన తరువాత బీజేపీ వైసీపీని టార్గెట్ చేస్తుందని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఏపీలో వైసీపీకి తామే ప్రతిపక్షంగా మారతామని కొందరు బీజేపీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తుండటం ఇందుకు నిదర్శనం. అయితే బీజేపీతో ఎప్పటికైనా తమకు ఇబ్బందులు తప్పవనే భావనతో ఉన్న వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ ముందుగానే ఆ పార్టీకి చెక్ చెప్పేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు వైసీపీ ప్రభుత్వం చర్యలను బట్టి అర్థమవుతోంది. ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యంకాదని బీజేపీ నేతలు పార్లమెంట్‌లో స్పష్టం చేశారు. ఏపీలోని బీజేపీ నేతలు సైతం ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయమని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే జాతీయస్థాయిలో బీజేపీతో సఖ్యతగా ఉంటున్న వైసీపీ మాత్రం ఈ విషయంలో అస్సలు వెనక్కి తగ్గడం లేదు. ఇందుకు అసలు కారణంగా ప్రత్యేక హోదా అంశంతో బీజేపీకి చెక్ చెప్పాలనే ఉద్దేశ్యమే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో ప్రత్యేక హోదా అంశం సజీవంగా ఉంటే బీజేపీ బలపడేందుకు అవకాశాలు సన్నగిల్లుతాయని వైసీపీ భావిస్తోంది. ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీని ఏపీ ప్రజలు నమ్మబోరని... అవసరమైనప్పుడు ఈ అంశంపైనే బీజేపీని టార్గెట్ చేయొచ్చని వైసీపీ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
ఈ కారణంగానే ఏపీ బడ్జెట్ ప్రసంగం సందర్భంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రత్యేక హోదా డిమాండ్‌ను మరోసారి ప్రస్తావించినట్టు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రత్యేక హోదా అంశంపై దాదాపు పదిహేను నిమిషాల పాటు ప్రసంగించిన మంత్రి బుగ్గన... కేంద్రం ఈ హామీని నిలబెట్టుకోవాల్సిందే అని చెప్పడం వెనుక అసలు వ్యూహం ఇదే అని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఏపీలో బలపడదామని భావిస్తున్న బీజేపీకి చెక్ చెప్పేందుకు ప్రత్యేక హోదా డిమాండ్‌ను సజీవంగా ఉంచాలని వైసీపీ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.