YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఏఐసీసీ అధ్యక్షురాలిగా సోనియా... ప్రియాంక

 ఏఐసీసీ అధ్యక్షురాలిగా సోనియా... ప్రియాంక

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

గ్రాండ్‌ఓల్డ్‌ పార్టీ కాంగ్రెస్‌ ఎప్పూడు లేని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ.. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌  గాంధీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామం ఆ పార్టీ శ్రేణులను తీవ్ర కలవరానికి గురిచేసింది. కాంగ్రెస్‌ ఆశాకిరణంగా భావించిన రాహుల్‌.. తొలి ఎన్నికల్లోనే పూర్తిగా తేలిపోవడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అయితే రాహుల్‌ రాజీనామాతో ఆ పార్టీలో నాయకత్వ సమస్య స్పష్టంగా కనిపిస్తోంది. ఫలితాల అనంతరం జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలోనే రాహుల్‌ రాజీనామా సమర్పించినప్పటికీ దానిపై ఇప్పటికీ సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంది. రాజీనామాను ఉపసంహరించుకోవాలని పార్టీ సీనియర్లు, ముఖ్యమంత్రులు, ఎంపీలు బుజ్జగించిన్నప్పటికీ ఆయన ససేమిరా అంటున్నారు. దీంతో రాహుల్‌ స్థానంలో నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దానితోనే అసలు సమస్య ప్రారంభమైంది.మరోవైపు కాంగ్రెస్‌ నూతన అధ్యక్ష పదవికి పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ సరైన వారంటూ మధ్యప్రదేశ్‌ మంత్రి సజ్జన్‌సింగ్‌ వర్మ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుత సమయంలో పార్టీని నడిపించగల సామర్థ్యం ప్రియాంకకు తప్ప మరెవ్వరికీ లేదని ఆయన అభిప్రాయపడ్డారు. దీనికి కొంతమంది నేతలు కూడా మద్దతు తెలుపుతున్నట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికలతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన ప్రియాంక బీజేపీని విమర్శించడంలో దిట్టగా హస్తం నేతలు భావిస్తున్నారు. యూపీతో పాటు ఉత్తారాది రాష్ట్రాల్లో పార్టీపై ఇప్పటికే పార్టీపై కొంత పట్టు సాధించినట్టు తెలుస్తోంది. ఇదిలావుండగా పార్టీ అధ్యక్ష పదవిని యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీనే మరోసారి చేపట్టాలని ఆ పార్టీ నేతలు సూచించినట్టు సమాచారం. అయితే అనారోగ్య కారణాల రీత్యా తాను స్వీకరించబోనని సోనియా తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. పార్టీ సీనియర్లలోనే ఎవరికోఒకరికి ఆ బాధ్యతలు అప్పగించాలని సోనియా సూచించినట్లు తెలిసింది. దీంతో మరో వారం రోజుల్లో నూతన సారథి ఎవరో తేలనుందని పార్టీ నేతలు చెబుతున్నారు.కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న రాష్ట్రాల్లో గత ఎన్నికల్లో ఆ పార్టీ చావు దెబ్బతిన్నది. దీంతో పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారగా.. సీనియర్లు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీకి పునర్‌వైభవం తీసుకువచ్చి, కాంగ్రెస్‌ కోటలో పాగా వేసిన బీజేపీని ఎదుర్కోగల సమర్థవంతమైన నేత ఎవరన్నది ఆ పార్టీ అధిష్టానం ఇంకా తేల్చలేకపోతోంది. ఒకవేళ నూతన సారథిని నియమించిన్నప్పటికీ.. గాంధీ కుటుంబ కనుసన్నల్లో మెలిగే వ్యక్తికే ఆ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఇదిలా వుండగా.. నూతన అధ్యక్షుడి నియమం కోసం అన్వేషిస్తున్న ఆ పార్టీకి అదే సమయంలో ఊహించని పరిణామాలు ఎదురువుతున్నాయి. దక్షిణాదిలో ఎంతోకొంత బలంగా ఉన్న కర్ణాటకలో ఆ పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటు తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో జేడీఎస్‌-కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం ఎప్పడు కూలిపోతుందోనన్న భయం హస్తం నేతలను వెంటాడుతోంది.కన్నడ సంక్షోభం పూర్తికాక ముందే గోవాలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజీనామాలు ఆ పార్టీకి ఊహించని షాకిచ్చాయి. దీంతో మూలిగే నక్కపై తాడిపండు పడ్డట్లు అయింది కాంగ్రెస్‌ పని. ఇదిలావుండగా.. రాహుల్‌ రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో సమర్థవంతమైన నేత కోసం చర్చిస్తున్నట్లు ఆపార్టీ నేత జ్యోతిరాధిత్య సింథియా తెలిపారు. పార్టీలో సంక్షోభం అంటూ ఏమీలేదని.. అధ్యక్ష స్థానాన్ని స్వీకరించేందుకు అనేక మంది నేతలు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. వారిలో సమర్థవంతమైన నేతను ఎన్నుకుంటామని తెలిపారు. అయితే మరో వారంలో ఈ ప్రక్రియనంతా పూర్తి చేస్తామని సింథియా వెల్లడించారు.

Related Posts