YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఏటా 20 లక్షల టన్నుల ఈ–వేస్ట్‌

ఏటా 20 లక్షల టన్నుల ఈ–వేస్ట్‌

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్న హైదరాబాద్‌ కస్టమర్లలో 12% మంది మాత్రమే స్వచ్ఛందంగా తమ డివైస్‌ను రీసైక్లింగ్‌కు ఇస్తున్నారు. ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు జమవుతున్న దేశాల్లో భారత్‌ టాప్‌–5లో ఉంది. ఏటా 20 లక్షల టన్నుల ఈ–వేస్ట్‌ పోగవుతోంది. ఈ నేపథ్యంలో రీసైక్లింగ్‌ ఇక్కడ అత్యవసరమని 91మొబైల్స్‌.కామ్‌ కో–ఫౌండర్‌ నితిన్‌ మాథుర్‌ ఈ సందర్భంగా చెప్పారు. ‘రోజురోజుకూ కొత్త స్మార్ట్‌ఫోన్‌ మోడళ్లు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. పనికిరాని స్మార్ట్‌ఫోన్లను పర్యావరణానికి హానికాని, భద్రమైన పద్ధతిలో ఏ విధంగా రీసైకిల్‌ చేయవచ్చో వినియోగదార్లకు వివరించాల్సిన అత్యవసర సమయం ఆసన్నమైంది. ఈ–వేస్ట్‌ వల్ల ఉత్పన్నమయ్యే పర్యావరణ సమస్యల గురించి 65 శాతం మంది హైదరాబాద్‌ స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు తెలుసు. అయినప్పటికీ వారు తమ మొబైల్‌ ఫోన్లను రీసైకిల్‌ చేయాలని భావించడం లేదు. ఈ–వేస్ట్‌ వల్ల తలెత్తే సమస్యల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపడుతున్నాం. అలాగే అవసరం లేని ఉత్పత్తులను ఎక్కడ రీసైకిల్, విక్రయించాలో తెలియజేస్తున్నాం’ అని వివరించారు కొత్త మోడల్‌ కొంటున్న సమయంలో 9% మంది పాత ఫోన్‌ను విక్రేతకు ఇస్తున్నారని గ్యాడ్జెట్‌ డిస్కవరీ సైట్‌ 91మొబైల్స్‌.కామ్‌ సర్వేలో తేలింది. ఈ–వేస్ట్‌ కంపెనీ సెరెబ్రా గ్రీన్, మాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ టెక్నాలజీతో కలిసి ఈ పోర్టల్‌ సర్వే చేసింది. దేశవ్యాప్తంగా 15,000 పైచిలుకు స్మార్ట్‌ఫోన్‌ వినియోగదార్లు ఇందు లో పాలుపంచుకున్నారు. దీని ప్రకారం... ఫోన్‌ రీసైక్లింగ్‌ వల్ల పర్యావరణానికి కలిగే ప్రయోజనాల గురించి 65% హైదరాబాద్‌ కస్టమర్లకు అవగాహన ఉంది. వీరిలో 20% మాత్రమే రీసైకిల్‌కు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. రీసైక్లింగ్‌ ప్రక్రియలో పాత మొబై ల్స్‌ నుంచి పనికి వచ్చే విడిభాగాలను, ప్లాస్టిక్‌ను వేరు చేసి, కావాల్సిన కంపెనీలకు సరఫరా చేస్తారు. అలాగే పనికిరాని వ్యర్థాలను పర్యావరణానికి హాని కాని రీతిలో, భద్రమైన పద్ధతిలో నిర్వీర్యం చేస్తారు. వినియోగదార్ల ఇళ్లలో పనికిరాని ఫోన్లు ఓ మూలన పేరుకుపోతున్నాయి. అయిదుకుపైగా పనికిరాని ఫోన్లు తమ వద్ద ఉన్నాయని 12 శాతం మంది సర్వే సందర్భంగా తెలిపారు. అవసరానికి పనికి వస్తుందనే ఉద్దేశంతో కనీసం ఒక ఫోన్‌  అట్టిపెట్టుకుంటున్నట్టు 55 శాతం మంది వెల్లడించారు. పనికిరాని పాత ఫోన్ల రీసైక్లింగ్‌ విషయాన్ని పట్టించుకోవటం లేదని 16 శాతం మంది తేల్చిచెప్పారు. అమ్మకం ద్వారా ఆశించిన విలువ రాకపోవడం వల్లే పాత ఫోన్‌ను భద్రంగా దాచుకున్నట్టు 20.6 శాతం మంది అభిప్రాయపడ్డారు. 6.9 శాతం కస్టమర్లు రీసైకిల్‌కు వ్యతిరేకం. క్యాష్‌కు రీసైకిల్‌ చేసినవారు 58% మంది ఉన్నారు. డిస్కౌంట్‌ కూపన్లకు 17 శాతం, గిఫ్ట్‌ కార్డులకు 5.4 శాతం మంది తమ పాత ఫోన్లను ఎక్స్‌చేంజ్‌ ద్వారా రీసైకిల్‌ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు పర్యావరణానికి రోజురోజుకీ సమస్యగా మారుతున్నాయి. ఇందులో స్మార్ట్‌ఫోన్లు ప్రధానమైనవి.

Related Posts