యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఓ వైపు ఏపీ బడ్జెట్ పై ప్రశంసలు కురిపిస్తూనే అందులోని లోటుపాట్లు ఎత్తిచూపారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. ఏపీలో ప్రభుత్వం మారినా పాలన మారలేదని ఎద్దేవా చేశారు. తాము గేట్లు తెరిస్తే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఖాళీ అవడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు తమ పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారని తెలిపారు. ఆదివారం పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ రాజేష్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో బీజేపీలోకి భారీగా చేరికలుంటాయని, ఈ దెబ్బతో టీడీపీ ఖాళీ అయిపోతుందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా పాలన మారలేదని కన్నా అన్నారు. ఏపీ బడ్జెట్ పేపర్ మీద బాగానే కనిపిస్తున్నా.. అమలు చేయడం కష్టమేనన్నారు. వైఎస్ జగన్ పాలన కూడా చంద్రబాబు తరహాలోనే కొనసాగుతోందని కన్నా విమర్శించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల మనిషని, ఆయనతో ఇంకెవరినీ పోల్చలేమన్నారు. జగన్ చెప్పే హామీలు నెరవేర్చాలంటే లక్షల కోట్లు కావాలని, ఇప్పటికే రుణభారంతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ ను మరింత అప్పుల్లోకి నెట్టవద్దని కోరారు.