యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
జులై 16న ఏర్పడే చంద్ర గ్రహాణం దేశంలో కనువిందు చేయనుంది. అరుణాచల్ప్రదేశ్లోని మారుమూల ప్రాంతాలు మినహా దేశంలోని ఎక్కడ నుంచైనా గ్రహణం స్పష్టంగా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. జులై 16న సంపూర్ణ చంద్రగ్రహణం ఉత్తరాషాడ నక్షత్రం ధనుస్సు రాశిలో ఏర్పడుతుంది. మంగళవారం రాత్రి 1.34 గంటల నుంచి తెల్లవారుజామున 4.31 గంటల వరకు ఉంటుంది. దాదాపు 3 గంటలు పుణ్యకాలం. ఇది విశేషమైన సమయం. అంతేకాదు, 149 ఏళ్ల తర్వాత ఆషాడ పూర్ణిమ రోజున ఈ గ్రహణం రావడం మరో విశేషం. గ్రహణం వాయువ్య దిశలో స్పర్శ, ఆగ్నేయ దిశలో మోక్షం పొందుతుంది. గర్భిణీలు బయట తిరగరాదని, అలా తిరిగితే గ్రహణదోషం కలుగుతుందని పెద్దలు చెబుతారు. ఉత్తరాయణం ముగిసిపోయిన తర్వాత ఏర్పడుతోన్న ఈ పుణ్య గ్రహణం వల్ల కొన్ని శుభాశుభ ఫలితాలు ఉంటాయి.
జ్యోతిషు ల అభిప్రాయం ప్రకారం.. చంద్ర గ్రహణం సమయంలో రాహువు, శని చంద్రునితో కలిసి ధనుస్సు రాశిలో ఉంటారు. ఇది గ్రహణం యొక్క ప్రభావాన్ని పెంచుతుంది. సూర్య, చంద్రులతో పాటు శుక్ర, శని, రాహు, కేతు గ్రహాలు ఒకే వృత్తంలో ఉంటాయి. ఇక గురు పూర్ణిమ రోజున గ్రహణం ఏర్పడం గత 149 ఏళ్లలో ఇదే తొలిసారి. 1870 జులై 12 అర్ధరాత్రి నుంచి 13 తెల్లవారుజాము మధ్య చంద్రగ్రహణం సంభవించింది. అది కూడా శని, రాహు, కేతువు ధనుస్సు రాశిలో ఉండగా, రాహువుతో కలిసి సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించాడు. మనః కారకుడు చంద్రుడు కాబట్టి మానసిక ఒత్తిడి లేకుండా మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే పరిహారం చేయాలి. ధనుస్సు రాశిలో గ్రహణం ఏర్పడుతుంది.. కాబట్టి ఆ రాశితోపాటు ఆ రాశికి ముందు వెనుక ఉండే వృశ్చికం, మకర రాశివారు జులై 17న శివుడికి అభిషేకం చేయిస్తే మంచిది. ఒకవేళ అభిషేకం చేయడం కుదరకపోతే ఓం నమశ్శివాయ మంత్రాన్ని 11 లేదా 108 సార్లు పఠిస్తే గ్రహణం ప్రభావం తగ్గుతుంది. అలాగే ఈ మంత్రాన్ని గ్రహణ సమయంలో పఠిస్తే వెయ్యి రేట్లు ఫలితం ఉంటుంది.