Karnataka
నిండయిన ఆత్మవిశ్వాసమే మనిషిలో సాధనాశక్తిని ప్రోది చేస్తుంది. ముందుకు వెళ్ళగలిగే చొరవకు దారితీస్తుంది. సవాళ్ళను ఎదుర్కొనే స్థయిర్యాన్ని అందిస్తుంది. ఉన్నచోటునే నిలిచిపోక కొత్తతీరాలకు, కొత్త రంగాలకు పరివ్యాప్తం కావాలన్న ఆలోచనకు బలాన్నిస్తుంది. కాలాన్ని వృధా చేయక నిత్యమూ, నిరంతరమూ క్రియా శీలతతో ఉండే తత్వాన్ని అలవరుస్తుంది. సమస్యలు, సవాళ్ళు ఎదురయినా వాటిని అధిగమించే ధీరత్వాన్ని చేకూరుస్తుంది. యవ్వనంలోనే కాదు, వయసు పెరుగుతున్నా, కాని కాలంలో కష్టాలు ఎదురవుతున్నా చెక్కుచెదరని మనో నిబ్బరంతో ఉండటమే ఆత్మవిశ్వాసానికి ప్రధానం. నెత్తురు మండే వయసులోనే కాదు, ఏ వయసులోనైనా అనుకున్నది సాధించి తీరగలమన్న ఆత్మవిశ్వాసం ఉండాలి. యవ్వనంలో ఏదైనా సాధించగలమనే భావన ఉంటుంది. కొండల్ని ఢకొీనగలమన్న ధీమాతో ముందుకు వెళతారు. కానీ అనుభవాల రాపిడిలో కొంచెం కొంచెం వెనక్కి జారిపోతుంటారు. మధ్యతరగతి గుడుగుడు గుంచం బతుకుల్లోకి కూరుకుపోతుంటారు. ఏళ్ళు మీద పడుతుంటే బస్తీ మే సవాల్ అన్న కంఠస్వరం గురగుర లాడుతుంది. ఊహించని ఓటమి ఎదురయితే కుంగిపోతారు. అనుకోని వైఫల్యాలతో తల్లడిల్లుతారు. అప్పటివరకు ఉన్న ఆత్మవిశ్వాసం ఒక్కసారిగా సన్నగిల్లుతుంటుంది. ఇక్కడే ఆత్మవిశ్వాసానికీ, ధీరతకీ అసలైన పరీక్ష. జీవితం పూలపాన్పు కాదు. నల్లేరు బండి మీద నడక కానే కాదు. సవాళ్ళు ఏం లేనప్పుడు అంతా సవ్యమే. సమస్యలతో తలపడాల్సి వచ్చినప్పుడే ఆత్మవిశ్వాసానికి అసలుసిసలు పరీక్ష. కుంగిపోతారా, పోరాడతారా అన్నది కళ్ళెదుట నిలిచే ప్రశ్న. వ్యక్తిగత జీవితంలోనూ, సామాజిక జీవితంలోనూ వెనకడుగు వేయాల్సిన సందర్భాలు తారసిల్లుతాయి. ఓటమి అనివార్యమైన సందర్భాల్లో ఎలా వ్యవహరిస్తామన్నదే కీలకం. ''కెరటం నాకు ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు'' అన్న స్వామి వివేకానంద మాటలు స్ఫూర్తిదాయకం. అవాంతరాలు లేకుండా మనిషి జీవితం సాగదు. వాటిని ఎలా ఎదుర్కొంటామన్నదే ముఖ్యం. మరణాన్ని సైతం సవాల్ చేసేలా ధైర్యంతో, సాహసంతో వ్యవహరించడం మనిషి జీవితానికి శోభనిస్తుంది. వారి మూర్తిమత్వానికి దీప్తినిస్తుంది. పోరాటంలో ప్రాణాలర్పించక తప్పదని తెలిసినా ముందుకు వెళ్ళడం మనిషి తెగువకీ, ఆత్మవిశ్వాసానికీ సిసలైన ప్రతీక. భగత్‌సింగ్, చెగువేరా వంటి వీరుల సాహసమే ఇందుకు నిదర్శనం. మృత్యువు అంచుల్లో ఉన్నా భయపడక, భీతిల్లక జీవించడం మహత్తర లక్షణం. ఇందుకు రేపు 76వ పుట్టినరోజు జరుపుకోబోయే స్టీఫెన్ హాకింగ్ (జననం: 8 జనవరి 1942) జీవితమే ఉదాహరణ. యాభయ్యేళ్ళుగా చక్రాల కుర్చీకి పరిమితమయి నప్పటికీ శాస్త్ర పరిశోధనలు చేస్తూ, పుస్తకాలు రాస్తూ ఇంకా ఎన్నో పనులు చేయాలని తపిస్తున్నారాయన. ''నేను మృత్యువుకు భయపడటం లేదు. త్వరగా మరణించాలని భావించటం లేదు. నేను కన్నుమూసే లోపు చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి'' అని ఆ మధ్యన హాకింగ్ చెప్పిన మాటలు ఆయనలోని జీవితేచ్ఛకీ, అనల్పమైన ఆత్మవిశ్వాసానికీ సంకేతం. వ్యక్తిగత జీవితంలోని ఆటుపోట్లకు, కల్లోలాలకు తల్లడిల్లేవారు హాకింగ్ జీవనగమనాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. అర్ధశతాబ్దంగా చక్రాల కుర్చీకి పరిమితమై వున్న మనిషి, ఇంకా బతకాలన్న జీవనకాంక్షని వ్యక్తం చేయడంలోని అసాధరణత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఈవిధమైన ఆత్మవిశ్వాసం, ఆలోచనాధోరణి ఉంటే ఆత్మహత్యలకు మనుషులు దూరంగా ఉండగలరు. మనిషి జీవించేది ఒకే ఒక్కసారి. ఆ జీవితాన్ని అర్థవంతంగా, పదుగురికి ఉపయోగపడేలా గడపడం గొప్ప ఔన్నత్యం. చరిత్రలోకి చూపు సారిస్తే సడలని దీక్షాదక్షతలతో ముందుకు వెళ్ళిన వారు ఎందరో కనిపిస్తారు. చైనా విప్లవ సమయాన ఎన్నెన్నో అగడ్తలు, అగచాట్లు ఎదుర్కొన్నారు మావో. విప్లవం అజేయం, అనివార్యమన్న ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిచారు నెత్తుటి త్యాగాలతో ప్రయాణించక తప్పలేదు. అయినప్పటికీ గమ్యం చేరే దాకా విప్లవ యానం ఆపకూడదన్న మావో పట్టుదల, దృఢచిత్తం మాత్రమే చైనా కమ్యూనిస్టు పార్టీని, సుదీర్ఘమైన లాంగ్‌మార్చ్‌ని విజయవంతంగా నడిపించాయి. మూడు దశాబ్దాలకు పైగా నిర్బంధంలో మగ్గినప్పటికీ నెల్సన్ మండేలా ఆత్మస్థయిర్యాన్ని కోల్పోలేదు. జాత్యాహంకార ప్రభుత్వానికి లొంగిపోలేదు. జాతివివక్షను అంతమొందించే ఆశయాన్ని వీడలేదు. దేశదేశాల్లో ప్రజల కోసం పోరాటపథంలో నిలిచిన అనేకులు పట్టుదలతో వ్యవహరించారు. లొంగుబాటు కన్నా మరణం మేలని తలచారు. లొంగనితరానికి ప్రతినిధులుగా చరిత్రలో నిలిచిపోయారు. అందుకే స్వామి వివేకానంద చెప్పినట్టు జీవనయానంలో మనల్ని దృఢచిత్తుల్ని చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించడం, బలహీనపరిచే ప్రతి ఆలోచననీ తిరస్కరించడం బతుకును దీప్తిమంతం చేస్తుంది. సార్థక జీవనానికి దాఖలాగా నిలుస్తుంది.
Related Posts