YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కర్నాటకం: రెబల్స్ కు బుజ్జగింపులు.. కీలక ప్రకటన చేసిన అసమ్మతి ఎమ్మెల్యే!

కర్నాటకం: రెబల్స్ కు బుజ్జగింపులు.. కీలక ప్రకటన చేసిన అసమ్మతి ఎమ్మెల్యే!

కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వంలో రెండు వారాలు కిందట తలెత్తిన అసమ్మతితో ఏర్పడిన సంక్షోభం కొనసాగుతోంది. బలనిరూపణకు తాను సిద్ధమేనంటూ సీఎం కుమారస్వామి శుక్రవారం ప్రకటించి షాక్కు గురిచేశారు. మరోవైపు, కర్ణాటకలో యథాతథ స్థితి కొనసాగించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. బలాన్ని నిరూపణకు తేదీ నిర్ణయిస్తే బలం నిరూపించుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పీకర్ రమేశ్ కుమార్ కు విజ్ఞప్తి చేశారు. అలాగే సీఎం ఎప్పుడు కోరితే తాను అప్పుడు సమయం ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నట్టు స్పీకర్ తెలిపారు. దీంతో కర్ణాటక రాజకీయాలు ఊహించని మలుపు తిరిగాయి.
విశ్వాస పరీక్షలో నెగ్గాలంటే అసంతృప్త ఎమ్మెల్యేలు కూడా సంకీర్ణానికి ఓటేయాల్సిన పరిస్థితి. దీంతో వారిని బుజ్జగించే ప్రయత్నాలను కాంగ్రెస్, జేడీఎస్ నేతలు ప్రారంభించారు. ఇందులో భాగంగా శనివారం తెల్లవారుజామున రెబల్ ఎమ్మెల్యే ఎంటీబీ నాగరాజ్ ఇంటికి కాంగ్రెస్ మంత్రి డీకే శివకుమార్ వెళ్లారు. ఆయన వెంట డిప్యూటీ సీఎం పరమేశ్వర కూడా ఉన్నారు. నాగరాజ్ ను కలిసి రాజీనామాకు వెనక్కి తీసుకోవాలని కోరారు. ఇరువురు నేతలూ ఎమ్మెల్యే నాగరాజ్ నివాసంలో నాలుగున్నర గంటల చర్చలు జరిపారు. ఈ చర్చలు ఫలించినట్టే ఉన్నాయి. తాను కాంగ్రెస్ తోనే ఉన్నానని ఎమ్మెల్యే నాగరాజు ప్రకటించారు. రాజీనామాకు పరిస్థితులు ప్రభావితం చేశాయని పేర్కొన్నారు.
అంతకు ముందు ఎమ్మెల్యే రామలింగారెడ్డి వర్గానికి చెందిన మునిరత్న, రోషన్ బేగ్, ఆయన కుమార్తె సౌమ్యారెడ్డితో కూడా శివకుమార్ మాట్లాడారు. ముంబైలో ఉన్న అసమ్మతి ఎమ్మెల్యేలను బెంగళూరుకు రావాలని కోరినట్లు తెలుస్తోంది. అలాగే కనీసం నలుగురు కాంగ్రెస్ రెబల్స్ తో సీఎం కుమారస్వామి నేరుగా మాట్లాడినట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. వచ్చే వారం బలపరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. దీంతో కాంగ్రెస్, బీజేపీలు తమ ఎమ్మెల్యేలను రిసార్ట్కు తరలించాయి. బీజేపీ తమ ఎమ్మెల్యేలను విధాన సభ నుంచే నాలుగు బృందాలుగా రిసార్టులకు తరలించింది.  
ముంబయిలో బసచేసిన అసంతృప్త ఎమ్మెల్యేలు నగరంలోని పలు ఆలయాలను దర్శించుకుంటున్నారు. శనివారం ఉదయం బీసీ పాటిల్, శివరామ్ హెబ్బర్, బసవరాజ్, సోమశేఖర్ లు సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించారు. శని, ఆదివారాలు రెబల్ ఎమ్మెల్యేలు షిర్డీ, శనిసింగాపూర్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. తాజా పరిణామాలపై బీజేపీ నేత యడ్యూరప్ప మాట్లాడుతూ.. ప్రభుత్వం కూలిపోయే సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలు చేజారిపోవడంతో కాంగ్రెస్, జేడీఎస్ ల్లో గందరగోళం నెలకుందని, వారిని వెనక్కురప్పించడానికి ఓ పద్దతి ప్రకారం కుట్రలు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం మెజార్టీ కోల్పోయిందని, ఇలాంటి సమయంలో విశ్వాస తీర్మానం అనేది అర్థంలేనిదని అన్నారు.

Related Posts