అయ్యవారిని దర్శించుకోవడానికి అందరూ ఆరాటపడుతుంటారు. కొందరు భక్తులు మాత్రం క్యూ లైన్లో గంటలు గంటలు నిరీక్షిస్తుంటారు. ఇలాంటి కష్టాలకు చెక్ పెట్టనుంది టీటీడీ. శ్రీవారి ముందు వీఐపీల హవాకు బ్రేక్ వేసి, సామాన్యులకే పెద్దపీట వేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యం భక్తులతో రద్దీగా ఉండే పవిత్ర పుణ్యక్షేత్రం. ఏడుకొండల వాడిని దర్శించుకోవడం కోసం సామాన్యులు భారీగా క్యూ కడుతుంటారు. తమ మొక్కులు చెల్లించుకుంటారు. కానీ వీఐపీ దర్శనాలు, బ్రేక్ దర్శనాలతో సాధారణ భక్తులకు దేవదేవుని దర్శనం మరింత ఆలస్యమవుతుంది. దీనిపై ప్రక్షాళన చేపట్టనున్నారు టీటీడీ చైర్మన్. భక్తుల రద్దీ తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు వీవీఐపీలకు ప్రత్యేక దర్శన సదుపాయం ఉంటుంది. ఆ తర్వాత వీఐపీలకు, కాస్త పలుకుబడి ఉన్నవారు ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 బ్రేక్ దర్శనాల ద్వారా శ్రీవారిని దర్శించుకుంటారు. ఇప్పుడీ స్పెషల్ దర్శనాలకు బ్రేక్ పడనుంది. వీఐపీలు ఇకపై ఏడాదికి ఒక్కసారి మాత్రమే దర్శనం చేసుకుంటే బాగుంటుందని, సాధ్యమైనంత వరకు సామాన్యులకే ప్రాధాన్యతనివ్వాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. టీటీడీలో అనేక ప్రక్షాళనలు జరుగుతాయని వివరించారు. ఎల్ 1, ఎల్ 2 దర్శనాలు రద్దుచేయాలంటూ ఇప్పటికే ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై ప్రభుత్వానికి, టీటీడీకి నోటిసులిచ్చింది కోర్టు. టీటీడీ తాజా నిర్ణయంతో శ్రీవారి ముందు వీఐపీల హవాకు బ్రేక్ పడనుంది. దీంతో వెంకన్న దర్శనం అత్యంత సులభతరం కానుందని సామాన్య భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.