విద్యుత్ కొనుగోలు కోసం గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను సమీక్షించాలని భావిస్తోన్న ఏపీ సీఎం జగన్ స్పీడ్‌కు కేంద్రం బ్రేకులేసింది. పీపీఏల సమీక్ష పెట్టుబడులపై ప్రభావం చూపుతుందని పేర్కొంటూ.. కేంద్ర సహాయ మంత్రి ఆర్‌కే సింగ్ స్వయంగా సీఎం జగన్‌కు లేఖ రాశారు. కాంట్రాక్టులను గౌరవించాలని ఆయన ఏపీ సీఎంకు సూచించారు. పీపీఏలను సమీక్షించవద్దని గతంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర ఇంధనశాఖ కార్యదర్శి లేఖ రాశారు. కేంద్ర రెగ్యులేటరీ నిబంధనల ప్రకారమే బిడ్డింగ్ పద్ధతిలోనే పీపీఏలను ఖరారు చేశారని ఆయన పేర్కొన్నారు. తాజాగా ఏపీ బడ్జెట్లోనూ పీపీఏల ప్రస్తావన రావడంతో.. కేంద్ర సహాయ మంత్రి ఆర్‌కే సింగ్ స్వయంగా సీఎం జగన్‌కు లేఖ రాశారు. అవినీతి రహిత పాలనకు కేంద్రం సహకరిస్తుందన్న ఆయన.. ఈ క్రమంలో సరైన రీతిలో నిర్ణయాలు తీసుకోకపోతే.. దాని ప్రభావం పెట్టుబడులపై పడుతుందన్నారు. దేశంలో వేగంగా వృద్ధి సాధిస్తోన్న రంగాల్లో పునరుత్పాదక విద్యుత్ రంగం ఒకటి. ఈ రంగంలో విదేశీ పెట్టుబడులు భారీగా పెరిగాయన్న కేంద్ర మంత్రి.. కాంట్రాక్టులను గౌరవించకపోతే పెట్టుబడులు తగ్గే ప్రమాదం ఉందన్నారు. టారిఫ్‌లను కేంద్ర, రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్లు నిర్ధారిస్తాయి. కాబ్టటి దానితో ప్రభుత్వానికి సంబంధం లేదని కేంద్ర మంత్రి సీఎంకు గుర్తు చేశారు. పీపీఏలను రద్దు చేయడం తప్పు, చట్ట వ్యతిరేకం. ఇలాంటి నిర్ణయాలతో పెట్టుబడుల వాతావరణం దెబ్బతింటుందని ఆర్కే సింగ్ తెలిపారు. అవినీతికి పాల్పడ్డారు అనడానికి కచ్చితమైన ఆధారాలు ఉంటే.. విచారణ జరపొచ్చన్నారు. లేఖతో పాటు వివిధ రాష్ట్రాల్లో పీపీఏల టారిఫ్‌ను కూడా పంపిన కేంద్ర మంత్రి.. ఏపీ కుదుర్చున్న ఒప్పందాలు వాటితో పోల్చుకోవాలని సూచించారు. ఏపీ ఇతర రాష్ట్రాల కన్నా తక్కువ మొత్తానికే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుందన్నారు. సోలార్, పవన విద్యుత్ టారిఫ్‌లు ఆయా రాష్ట్రాల్లోని వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయని ఆర్కే సింగ్ లేఖలో జగన్ సర్కారుకు తెలిపారు. పునరుత్పాదక విద్యుత్ రంగంలో పెట్టుబడుల ప్రక్రియ నిరంతరం కొనసాగడం ముఖ్యమన్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన సౌర, పవన విద్యుత్ కొనుగోళ్లలో భారీ అవకతవకలు జరిగినట్టు జగన్ సర్కారు భావిస్తోంది. గత మూడేళ్లలో సౌర, పవన రంగంలో పీపీఏల కారణంగా ప్రభుత్వ పంపిణీ సంస్థలకు రూ.2,636 కోట్ల నష్టం వాటిల్లిందని సీఎం చెబుతున్నారు. గత ప్రభుత్వం హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాల సమీక్ష కోసం జగన్ సర్కారు ట్రాన్స్‌కో సీఎండీ కన్వీనర్‌గా 9 మందితో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసింది.