యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ర్ణాటకలో తాజా రాజకీయ పరిణామాలు ఆసక్తిగా మారాయి. కర్ణాటక సీఎం కుమారస్వామి బలపరీక్షకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార పక్షానికి కొంత సమయం ఇస్తున్నామని, ఈ నెల 18న ఉదయం పదకొండు గంటలకు బలపరీక్ష నిర్వహించనున్నట్టు స్పీకర్ రమేశ్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, విధాన సభలో అవిశ్వాస తీర్మానం నోటీసును బీజేపీ నేత జేసీ మధుస్వామి ప్రవేశపెట్టారు. సభలో ఆధిక్యత నిరూపించుకునేంత వరకూ సభ నిర్వహించవద్దని స్పీకర్ ను కోరారు. ఒకవేళ సభ నిర్వహిస్తే వాకౌట్ చేస్తామని స్పీకర్ కు స్పష్టం చేశారు. బలపరీక్ష జరిపి కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం ఆధిక్యత నిరూపించుకోవాలని బీఏసీలో బీజేపీ డిమాండ్ చేసింది. ముఖ్యమంత్రి కుమారస్వామిపై బీజేపీ స్పీకర్ కు అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సమయం ఇద్దామని స్పీకర్ కోరగా.. దానికి ప్రతిపక్ష బీజేపీ అంగీకరించలేదు. దీంతో బలపరీక్ష జరిపి ఆధిక్యత నిరూపించుకోవాలని సంకీర్ణ సర్కార్ ను స్పీకర్ రమేష్ కుమార్ ఆదేశించారు. కర్ణాటక విధాన సభను గురువారం వరకు స్పీకర్ వాయిదా వేశారు.
భారీ భద్రత మధ్య సమావేశం
కొందరు ఎమ్మెల్యేలు, స్వతంత్రులు అధికార ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారడంతో కర్ణాటక ప్రభుత్వం అనిశ్చితిలో పడిన నేపథ్యంలో, నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా, ఎన్నడూ లేనంత భద్రతను ఏర్పాటు చేశారు. రాష్ట్ర రాజకీయ భవిష్యత్ ఈ సమావేశాల్లో కీలక మలుపు తిరుగుతుందని భావిస్తున్న నేపథ్యంలో, సభలో ఏమైనా జరగవచ్చని, కుమారస్వామి విశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సి వస్తే, ప్రభుత్వం రద్దయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఇప్పటికే పలువురు కాంగ్రెస్, జనతాదళ్ సెక్యులర్ ఎమ్మెల్యేలు రాజీనామా లేఖలు సమర్పించి, వాటిని ఆమోదించాలని సుప్రీంకోర్టు వరకూ వెళ్లిన సంగతి తెలిసిందే. రెబల్స్ గా మారిన ఎమ్మెల్యేలంతా ముంబైలో మకాం వేయగా, వారిని బుజ్జగించేందుకు కీలక నేతలను పంపినా ఫలితం లేకపోయింది. రాష్ట్రంలో అధికారాన్ని ఎలాగైనా దక్కించుకోవాలన్న ఉద్దేశంలో ఉన్న బీజేపీయే ఫిరాయింపు రాజకీయాలను ప్రోత్సహిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.225 స్థానాలున్న అసెంబ్లీలో 79 మంది సభ్యులున్న కాంగ్రెస్, 37 మంది సభ్యులున్న జేడీ (ఎస్)తో పాటు ఒక బీఎస్పీ సభ్యుడు ప్రభుత్వంలో భాగంగా ఉన్నారు. వీరి బలం 117 కాగా, విపక్షంలోని బీజేపీకి 107 మంది సభ్యుల బలముంది. మరో స్వతంత్ర సభ్యుడు కూడా ఉన్నారు. ఎమ్మెల్యేలు చేసిన రాజీనామాలను స్పీకర్ ఆమోదిస్తే, ఆ వెంటనే ప్రభుత్వం పడిపోయి, బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు మార్గం సుగమం అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత సమావేశాల్లో స్పీకర్ నిర్ణయమే కీలకం కానుంది