మాయావతి మళ్లీ క్రమంగా లైమ్ లైట్ లోకి వస్తున్నారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో దారుణ ఓటమితో మాయావతి దాదాపుగా కుంగిపోయారు. తాము చేపట్టిన ఫార్ములా ఫలించకపోవడంపై మాయావతి కొంత కుంగుబాటుకు గురయ్యారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మాయావతి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అఖిలేష్ యాదవ్ కు చెందిన సమాజ్ వాదీ పార్టీతో కలసి పోటీ చేసిన సంగతి తెలిసిందే.అయితే ఈ పొత్తులు రెండు పార్టీలకూ కలసి రాలేదు. దీంతో ఇకపై ఉత్తరప్రదేశ్ లో జరిగే ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేస్తామని మాయావతి ప్రకటించారు. మాయావతి సుదీర్ఘకాలం సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తో పోరాడారు. ఆమె అధికారంలో ఉన్నా విపక్షంలో ఉన్నా టార్గెట్ ములాయం అంటుండే వారు. దీంతో కిందిస్థాయి కార్యకర్తలు సయితం శత్రువులుగా మారిన పరిస్థితి.లోక్ సభ ఎన్నికలకు ముందు జరిగిన ఉప ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ కలసి పోటీ చేయడం కొంత కలసి వచ్చింది. బీజేపీ సిట్టింగ్ సీట్లలో గెలుపు గుర్రం ఎక్కింది. దీంతో ఇదే ఫార్ములాతో లోక్ సభ ఎన్నికలకు వెళ్లాలని మాయావతి ముందుగానే నిర్ణయించారు. కాంగ్రెస్ ను పక్కన పెట్టి బీఎస్పీ, ఎస్సీలు కలసి పోటీ చేశాయి. ములాయం సింగ్, మాయావతి ఇకే వేదికపైకి వచ్చి కార్యకర్తలకు బలమైన సంకేతాలను పంపారు.అయినా ఫలితం లేదు. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ హవా నడిచింది. రెండు పార్టీల ఓట్లు ఒకరికి మరొకరికి బదిలీ కాలేదు. దీంతో మాయావతి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు పార్టీని బలోపేతం చేసేందుకు ఆమె తిరిగి పార్టీ కార్యక్రమాలను ఉధృతం చేశారు. ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న మూకదాడులపై ఆమె ధ్వజమెత్తారు. ఇప్పుడు మాయావతికి ప్రధాన శత్రువు బీజేపీగా కన్పిస్తుండటంతో ఆ పార్టీనే టార్గెట్ చేశారు. మాయావతి మళ్లీ లైమ్ లైట్ లోకి రావడంతో పార్టీ శ్రేణుల్లో సయితం ఉత్సాహం పెల్లుబుకుతోంది.