యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
క్రికెటర్ గా, కామెడీ షో వ్యాఖ్యతగా పంజాబ్ మంత్రిగా నిన్న మొన్నటి వరకూ ఉన్న నవజ్యోత్ సింగ్ సిద్ధూ తన సొంత వ్యవహార శైలే పార్టీలకు, పదవులకు దూరం చేస్తున్నాయన్న విమర్శలున్నాయి. నిజానికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ భారతీయ జనతా పార్టీలో ఉండేవారు. 2004 నుంచి పదేళ్ల పాటు ఆయన బీజేపీలోనే ఉన్నారు. ఆయన ఆ పార్టీలో పదవులు కూడా చేపట్టారు. పంజాబ్ ఎన్నికలకు ముందే సొంత పార్టీ ఆవాజ్ ఈ పంజాబ్ పెట్టిన సిద్ధూ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.పంజాబ్ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కెప్టెన్ అమరీందర్ సింగ్ పంజాబ్ ముఖ్యమంత్రి అయ్యారు. నవజ్యోత్ సింగ్ సిద్ధూను తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సిద్ధూ తొలిరోజు నుంచే వివాదాలకు కేంద్ర బిందువయ్యారు. మంత్రిగా ఉండి కామెడీషో లో వ్యాఖ్యాతగా వ్యవహరించకూడదన్న నిబంధనను తొలుత నవజ్యోత్ సింగ్ సిద్దూ అతిక్రమించారు. తర్వాత కోర్టు అక్షింతలు కూడా పడ్డాయి.
ఇమ్రాన్ ఖాన్ ప్రధాని మంత్రి అయిన తర్వాత ఆయన ఆహ్వానం మేరకు అక్కడకు వెళ్లిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ వ్యవహారశైలి వివాదాస్పదమయింది. పాకిస్థాన్ సైనికాధిపతి జనరల్ బజ్వాను ఆలింగనం చేసుకోవడం, కర్తార్ పూర్ క్యారిడార్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ అనుమతి లేకుండా హాజరు కావడం చర్చనీయాంశంగ మారాయి. భారత్ సరిహద్దుల్లో ఉన్న కర్తార్ పూర్ సాహిబ్ గురుద్వారా నుంచి భారత్ వైపు క్యారిడార్ నిర్మాణం విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించారు.అయితే కెప్టెన్ అమరీందర్ సింగ్ ఎప్పటికప్పుడు సిద్ధూను కట్టడి చేయాలని చూశారు. కానీ సాధ్యం కాలేదు. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీకి కూడా సిద్దూ వైఖరిపై ఫిర్యాదు చేశారు. ఇటీవల సిద్ధూ ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పదవుల్లో ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సెింగ్ కోత పెట్టారు. పర్యాటక శాఖను ఆయన నుంచి తప్పించారు. దీంతో ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కు, సిద్ధూకు పడటం లేదని గత కొన్నాళ్ల నుంచి జరుగుతున్న ప్రచారం నిజమని తేలింది. మంత్రి పదవికి రాజీనామా చేసిన సిద్ధూ కాంగ్రెస్ లోనే కొనసాగుతారా? లేదా? అన్నది చూడాలి.