YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ దేశీయం

కాంగ్రెస్ కు అధ్యక్షుడు కావలెను...

కాంగ్రెస్ కు అధ్యక్షుడు కావలెను...

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

భారత జాతీయ కాంగ్రెస్ అధిష్టానం ఇరకాటంలో పడింది. ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసి దాదాపు యాభై రోజులు గడుస్తోంది. అయినా ఆ పార్టీ అధ్యక్షుడు ఎవరో ఇంత వరకూ తెలియదు. రాహుల్ గాంధీ మాత్రం తన మానాన తాను రాజీనామా చేసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని సూచించి మరీ వెళ్లిపోయారు. దీంతో ఇప్పుడు సీనియర్ నేతలకు పార్టీ వ్యవహారాలు తలనొప్పిగా మారాయి.ఏఐసీసీ తాత్కాలిక అధ్యక్షుడిగా మోతీలాల్ ఓరాను నియమించినప్పటికీ ఆయన మాట చెల్లుబాటు కాదన్నది అందరికీ తెలిసిందే. రాహుల్ గాంధీ రాజీనామా చేసిన తర్వాత ఇటు గోవా, కర్ణాటక కాంగ్రెస్ లో సంక్షోభం నెలకొంది. వీటిని పరిష్కరించేందుకు సీనియర్ నేతలు వచ్చినా ఫలితం లేకుండా పోయింది. ఇందుకు ప్రధాన కారణం గాంధీ కుటుంబం నుంచి అధ్యక్ష పదవిలో ఎవరూ లేకపోవడమేనన్న వాదన లేకపోలేదు.తాజాగా పార్టీ అధ్యక్ష పదవిని తిరిగి సోనియాగాంధీనే స్వీకరించాలని సీనియర్ నేతలు గట్టిగ ప్రయత్నిస్తున్నారు. అహ్మద్ పటేల్, గులాం నబీ ఆజాద్ వంటి నేతలు సోనియాగాంధీకి నచ్చచెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. త్వరలో కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో
హైకమాండ్ కమాండ్ చేసే స్థాయిలో ఉండాలన్నది సీనియర్ నేతల వాదన. రాహుల్ గాంధీ అధ్యక్ష పగ్గాలు చేపట్టేందుకు ససేమిరా అనడంతో సోనియా గాంధీయే తిరిగి బాధ్యతలను స్వీకరించాలని గట్టిగా పట్టుబడుతున్నారు.లేకుంటే కాంగ్రెస్ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారనుందని హెచ్చరిస్తున్నారు. సోనియా గాంధీ దాదాపు రెండు దశాబ్దాల పాటు అధ్యక్ష పదవిలో ఉన్నారు. ఆమె అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు కూడా గెలుపోటములను పార్టీ చవిచూసింది. అయితే నిన్న మొన్నటి వరకూ రాహుల్ గాంధీపై ఆశలుపెట్టుకున్న నేతలు ఆయన వినకపోవడంతో సోనియాను ఎలాగైనా ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి సోనియా గాంధీ తిరిగి అధ్యక్ష పదవి చేపడతారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Related Posts