YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

కృష్ణ తత్వం..

Highlights

  • ఒక వ్యాసం..
  • ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే
కృష్ణ తత్వం..

కృష్ణుడి జీవితమే ఒక మానవ జీవన అనుభవసారం.. మూర్తీ భవించిన వ్యక్తిత్వ వికాసం.. శ్రీకృష్ణుని రూపం నల్లనిది.. మనసు మాత్రం వెన్న పూసలా తెల్లనిది..  దేనికీ భయపడని వ్యక్తిత్వంతో చేపట్టిన ప్రతీ పనిలోనూ విజయం సాధించాడు.. నమ్మిన వారికి కొండంత అండగా నిలిచాడు.

చిన్నప్పుడే కృష్ణయ్య... కన్న తల్లిదండ్రులకు దూరమయ్యాడు. సొంతమేనమామే శత్రువై సంహరించాలని చూసినా చలించ లేదు.. తామరాకు మీద నీటి బొట్టులా ఉన్నాడు... గోవుల మధ్య గోపన్నలా తిరిగాడు.. గోధూళి వేళ మూరళి వాయిస్తూ తన ఈడు పిల్లలతో చక్కగా కలసి పోయాడు... కాళీయ మర్దనం చేశాడు.. శత్రు సంహారం ఎలా చేయాలో చేసి చూపించాడు.. చిటికెన వేలితో గోవర్ధన గిరిని ఎత్తి తన మహిమను ప్రదర్శించాడు.. యశోదమ్మ దగ్గర పెరిగాడు..  అమాయక బాలునిలా మన్ను తిన్నాడు.. అదేమని చెవి మెలేసిన తల్లికి నోటిలో 14 భువన భాండాలు చూపించాడు..  తల్లి ప్రేమ పాశానికి లొంగిపోయి గంధర్వులకి శాపవిముక్తి కలిగించాడు.... ఉట్టి కొట్టాడు.. వెన్న దొంగలించాడు.. ఇదే ఇప్పటికీ కృష్ణాష్టమి రోజున ఉట్టి పండగగా మనం జరుపుకుంటున్నాం..

అసలు కృష్ణుడంటేనే అలౌకిక ఆనందానికి ప్రతిరూపం..  సచ్చిదానంద రూపం.. సత్‌చిత్ ఆనంద స్వరూపం.. పాపాల్ని నాశనం చేసేదే కృష్ణ తత్వం.. శ్రీ మహా విష్ణువు తొమ్మిదో అవతారమే కృష్ణుడు.. కృష్ఱుడి పేరు తలుచుకుంటేనే అమరత్వం సిద్ధిస్తుంది.. జవసత్వాలు ఉట్టి పడతాయి.. కృష్ణ నామం కర్ణపేయంగా ఉంటుంది..

కృష్ణుడు అవతార పురుషుడే అయినా.. అన్నగారు బలరాముడంటే.. అమితమైన సోదర బంధం... అంతకన్నా మించిన గురు భావన.. కుటుంబంలో చిన్నవారు రక్త బంధాన్ని ఎలా గౌరవించాలో కృష్ణుడి క్యారక్టర్ చెబుతుంది.. అలాగే స్నేహంపై కూడా కృష్ణుడి వ్యక్తిత్వం నుంచి ఈతరం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది.. కుచేలుడు కృష్ణుడికన్నా.. ఎంతో కింది స్థాయి వ్యక్తి.. స్నేహ బంధమనేది వీటన్నింటికీ అతీతమైనది అని నిరూపించాడు ..... కుచేలుడు ప్రేమతో తెచ్చిన అటుకులనే ఇష్టంగా తిన్నాడు.. 

ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే :

ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే అన్నాడు కృష్ణుడు. కృష్ణుడు కారణజన్ముడు.. అందుకే తన అవసరం ఉంటే మళ్లీ మళ్లీ పుడతానన్నాడు.. కృష్ణుడిలో మంచి రాజకీయ వేత్త ఉన్నాడు..  కృష్ణుని ప్రమేయం లేకుండా మహాభారత యుద్ధం కానీ, భగవద్గీత పుట్టుక కానీ జరిగేది కాదు..  దుష్ట శిక్షణ కోసం.. శిష్ట రక్షణ కోసం పాటు పడ్డాడు.. 

కృష్ణుడు కారణజన్ముడు.. రామావతారంలో నరుడిగా జన్మించినా కృష్ణావతారంలో తానే దేవుడినని ప్రకటించాడు.. ప్రజలు అశాంతి, అధర్మ మార్గాల్లో పయనించినప్పుడు..  దుష్టులు చెలరేగి ధర్మం క్షీణిస్తున్న సమయంలో ధర్మ సంస్థాపనకు తాను మళ్లీ మళ్లీ పుడుతూనే ఉంటానని కృష్ణ పరమాత్మ చెప్పాడు.. దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు తగిన సమయం కోసం ఆగలేదు..  దానికోెసం పుట్టిన నాటి నుంచే పాటుపడ్డాడు..  పసి పిల్లాడిలా ఉండగానే మహిమలు ప్రదర్శించాడు.. భోగ లాలసుడిగా, నర్తకుడిగా, మహా యోధుడిగా, ప్రేమకు ప్రతిరూపంగా కృష్ణావతారాన్ని మనం చూడొచ్చు..
 

Related Posts