YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

దోశ కింగ్ మృతి

దోశ కింగ్ మృతి

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ప్రఖ్యాత శరవణభవన్‌ హోటల్స్‌ యజమాని, దోశకింగ్‌గా ప్రసిద్ధికెక్కిన పి.రాజగోపాల్‌(71) ఇకలేరు. అనారోగ్యంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం ఉదయం మృతిచెందారు. దీంతో ఆయన కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు.మూడో పెళ్లి కోసం తన దగ్గర పనిచేసే ఉద్యోగి కుమార్తె భర్తను హత్య చేయించిన కేసులో ఆయనకు మద్రాస్‌ హైకోర్టు విధించిన యావజ్జీవ శిక్షను ఇటీవల సుప్రీంకోర్టు సమర్దించిన సంగతి తెలిసిందే. జులై 7వ తేదీలోగా కోర్టులో లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించగా 9వ తేదీన ఆయన లొంగిపోయారు. తాను అనారోగ్యంలో బాధపడుతున్నానని కొంత సమయం కావాలని రాజగోపాల్ కోరినా కోర్టు ససేమిరా అనడంతో స్ట్రెచర్ పైనే ఆయన న్యాయస్థానానికి వచ్చి లొంగిపోయారు. ఈ సందర్భంగానే ఆయన గుండెపోటు రావడంతో చెన్నైలోని ఓ ప్రముఖ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం ఆయన చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. తూత్తుకూడికి చెందిన రాజగోపాల్‌ 1979లో చెన్నైలోని కేకే నగర్‌లో ఉన్న కామాక్షి భవన్‌ అనే హోటల్‌ను కొనుగోలుచేసి దానిని శరవణ భవన్‌గా పేరు మార్చాడు. నాణ్యత, శుభ్రత విషయంలో రాజీపడకుండా కస్టమర్లకు రుచికరమైన ఆహారం అందజేయడంతో తక్కువ కాలంలో ఈ హోటల్‌కు మంచి గుర్తింపు దక్కింది. దీంతో తన వ్యాపారాన్ని తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల్లోనూ విస్తరించారు. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, ఆస్ట్రేలియా సహా 20 దేశాల్లో శరవణభవన్‌కు ఓ బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చారు. దోశ కింగ్‌గా గుర్తింపు పొందిన అయనకు అప్పటికే వివాహమై ఇద్దరు భార్యలు ఉన్నారు. అయితే, జ్యోతిషంపై అపార నమ్మకం ఉండటంతో మరో పెళ్లి చేసుకుంటే మరింత బాగుంటుందని ఓ జ్యోతిషుడు ఆయనకు సలహా ఇచ్చాడు. దీంతో తన వద్ద అసిస్టెంట్‌ మేనేజర్‌‌గా పనిచేసే వ్యక్తి కుమార్తె జీవజ్యోతిని వివాహం చేసుకోవాలని భావించాడు. అయితే అప్పటికే అదే సంస్థలో పనిచేసే ప్రిన్స్‌ శాంతకుమార్‌‌, జీవజ్యోతి ప్రేమించుకోవడంతో ఈ ప్రతిపాదనకు ఆమె నిరాకరించింది. ఈ నేపథ్యంలో జ్యోతి, శాంతకుమార్‌లు 1999లో పెళ్లి చేసుకున్నారు. దీంతో ఆగ్రహించిన రాజగోపాల్ ఇద్దరూ విడాకులు తీసుకోవాలని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో దంపతులు 2001లో రాజగోపాల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది జరిగిన కొద్దిరోజులకే శాంతకుమార్ హత్యకు గురయ్యాడు. 2001 అక్టోబరులో కొడైకొనాల్‌లోని పెరుమాళమలై ప్రాంతంలో శాంతకుమార్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. తన భర్త హత్య వెనుక రాజగోపాల్ హస్తం ఉందని జీవజ్యోతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆయనపై హత్యకేసు నమోదుచేశారు. దీంతో కోర్టులో లొంగిపోయిన ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు. ఈ కేసును విచారించిన కోర్టు రాజగోపాల్ సహా ఆయనకు సహకరించిన వారిని దోషులుగా నిర్ధారించింది. రాజగోపాల్‌కు యావజ్జీవ శిక్ష విధించగా ఆయన ఆయన 2009లో మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. పక్కా ఆధారాలు ఉండటంతో హైకోర్టు కూడా కింది కోర్టు తీర్పును సమర్ధిస్తూ తీర్పు వెలువరించింది. దీనిపై ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లినా నిరాశే మిగిలింది. దీంతో ఆయన గత మంగళవారం(జులై 9) కోర్టులో లొంగిపోయారు. అప్పటి నుంచే ఆయన జైలుశిక్ష ప్రారంభం కాగా పదిరోజులు తిరగకముందే ఆయన ప్రాణాలు కోల్పోయారు. శరవణన్ భవన్ హోటల్స్ యజమానిగా, దోశ కింగ్‌గా ప్రపంచ ప్రసిద్ధి చెందిన రాజగోపాల్.. హత్యకేసులో ఇరుక్కుని విషాదకర రీతిలో తన ప్రస్థానాన్ని ముగించారు.

Related Posts