యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కర్నాటక అసెంబ్లీలో ఇవాళ ఆ రాష్ట్ర సీఎం హెచ్‌డీ కుమారస్వామి బలపరీక్ష కోసం తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. స్పీకర్ రమేశ్ పాత్రపైన కూడా కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని సీఎం తన ప్రసంగంలో ఆరోపించారు. యడ్డీ ఎందుకు ఇంత తొందర పడుతున్నారని విమర్శించారు. విశ్వాసపరీక్షపై చర్చ ఒక్క రోజు మించకుండా నిర్వహించాలని ప్రతిపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప సభలో తెలిపారు. రూల్ 164 ప్రకారమే చర్చ జరుగుతుందని స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ చెప్పారు. రెబల్ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ముందు ఆరోపణలు చేశారని, వాటిని క్లారిఫై చేయాల్సిన అవసరం ఉందని సీఎం కుమారస్వామి చెప్పారు. చర్చ లేకుండా బలపరీక్ష ఉండదని సీఎం అన్నారు. రెబల్ ఎమ్మెల్యేలతో పాటు ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒక బీఎస్పీ ఎమ్మెల్యే ఇవాళ సభకు రాలేదు. రెబల్ జట్టులో 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. పార్టీ ఫిరాయింపు రాజ్యాంగ మూలాలను ధ్వంసం చేస్తున్నదని కాంగ్రెస్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య అన్నారు. పార్టీ ఫిరాయింపు అవినీతి రాజకీయాలకు తెరలేపుతుందన్నారు. దీంతో సభలో ఉన్న బీజేపీ సభ్యులు భారీ స్థాయిలో వ్యతిరేక నినాదాలు చేశారు.