43 మందిని కాపాడిన ఆర్టీసీ డ్రైవర్!
తన ప్రాణాల కంటే ప్రయాణికుల ప్రాణాలే విలువైనవని గ్రహించిన ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్ గుండె నొప్పితో విలవిల్లాడుతున్నా ప్రయాణికుల ప్రాణాలకు ప్రమాదం జరగకుండా కాపాడాడు. ఓ చేత్తో గుండెను అదిమిపట్టుకుని మరో చేత్తో స్టీరింగ్ తిప్పుతూ అతి కష్టం మీద బస్సును రోడ్డు పక్కన ఆపి స్టీరింగ్‌పై వాలిపోయాడు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి ధర్మవరానికి వెళ్తున్న బస్సులో జరిగిందీ ఘటన. కళ్యాణదుర్గం ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న డ్రైవర్ కంఠేశ్వర్ గురువారం 43 మంది ప్రయాణికులతో ధర్మవరానికి బయలుదేరాడు. బస్సు కనగానపల్లి మండలం ఎలకుంట్ల గ్రామం దాటాక కంఠేశ్వర్‌కు గుండెల్లో నొప్పి మొదలైంది. శరీరం వణకడం మొదలైంది. నొప్పి కారణంగా కాళ్లు, చేతులు స్వాధీనం తప్పుతున్నాయి.
తన పరిస్థితి స్పష్టంగా అర్థం అవుతున్నప్పటికీ ఏమీ చేయలేని, ప్రయాణికులకు చెప్పలేని నిస్సహాయత. దీంతో ఒక చేతిని చాతీపై వేసి అదిమిపట్టుకుని మరో చేత్తో డ్రైవింగ్ చేస్తూ బస్సు వేగాన్ని తగ్గించి రోడ్డు పక్కన ఆపాడు. ఆ తర్వాత స్పృహ కోల్పోవడంతో స్టీరింగ్‌పై వాలిపోయాడు. పరిస్థితిని గమనించిన ప్రయాణికులు '108'కు ఫోన్ చేసి అనంతపురం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం డ్రైవర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. గుండె నొప్పి వేధిస్తున్నా సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన కంఠేశ్వర్‌ను పలువురు అభినందిస్తున్నారు.