Highlights
- 40 మంది పోలీసులపై ఉన్నతాధికారుల బదిలీలు
- హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో
- అప్రమత్తమైన అక్రమార్కులు
తెలంగాణ రాష్ట్ర పరిధిలోని హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తూ.. ‘వసూళ్ల’కు పాల్పడుతున్న 40 మంది పోలీసులపై ఉన్నతాధికారులు వేటు వేశారు. వారిని నగర సాయుధ విభాగం కేంద్ర కార్యాలయానికి బదిలీ చేస్తూ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ ఠాణాల్లో కొందరు అధికారులు, సిబ్బంది బెదిరింపులు, సెటిల్‌మెంట్లతో అక్రమంగా సంపాదిస్తున్నారని ‘ఈనాడు’లో ఫిబ్రవరి 25, 28 తేదీల్లో కథనాలు ప్రచురితమయ్యాయి. వీటిపై స్పందించిన ఉన్నతాధికారులు అంతర్గతంగా విచారణ చేపట్టారు. శాంతిభద్రతల ఠాణాల్లో పనిచేస్తున్న కొందరు హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు వీరిలో ఉన్నారని నిర్ధరణ కావడంతో శాఖాపరమైన చర్యలకు ఉపక్రమించారు. బదిలీ వేటు పడిన వారిలో 60శాతం మంది వాణిజ్య సముదాయాలు, మద్యం దుకాణాలు, పబ్బులు, హోటళ్ల వద్ద నెలవారీ మామూళ్లు తీసుకొంటూ... ఈ బాధ్యతలు అప్పగించిన వారికి సొమ్ము చేరవేస్తున్నారని గుర్తించారు. ఈ లావాదేవీలపై మరిన్ని సాక్ష్యాధారాలు, రుజువులు సంపాదించేందుకు లోతుగా విచారణ చేస్తున్నట్లు సమాచారం. కొన్ని ఠాణాల్లో అధికారులు బెదిరింపులు, సెటిల్‌మెంట్ల కోసం హోంగార్డులు, కానిస్టేబుళ్లను వినియోగించుకొంటున్నారు. తమ వ్యక్తిగత పనులు చేస్తున్నందుకు వీరిని ప్రత్యేకంగా చూసుకొంటున్నారు. ఈ చనువుతో ఆయా హోంగార్డులు, కానిస్టేబుళ్లు సదరు అధికారుల పేర్లు ఉపయోగించుకుని వసూళ్లకు పాల్పడుతున్నారు. నలభై మందిపై ఒకేసారి చర్యలు తీసుకున్న నేపథ్యంలో, పోలీస్ స్టేషన్లలో ఈ తరహా వ్యవహారాల్లో తలదూరుస్తున్న మిగిలిన కిందిస్థాయి సిబ్బంది అప్రమత్తమయ్యారు. మరోవైపు కొందరు అధికారులు తాము అవినీతి, అక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు సమాచారం.