YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అప్పుడు మన్మోహన్... ఇప్పుడు జయశంకర్ కేంద్ర కేబినెట్ లో అధికారుల సందడి

 అప్పుడు మన్మోహన్... ఇప్పుడు జయశంకర్ కేంద్ర కేబినెట్ లో అధికారుల సందడి

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

తొమ్మిదో దశకం ప్రారంభంలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పీవీ నరసింహారావు ప్రముఖ ఆర్థిక వేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రిగా తీసుకుని అందరినీ ఆశ్చర్య పరిచారు. ఆయన నియామకంపై అప్పట్లో హస్తం పార్టీ శ్రేణుల్లో ఒకింత అసంతృప్తి వ్యక్తమయినప్పటికీ పీవీ నరసింహరావు లెక్క చేయలేదు. పార్టీలో ఆర్థికశాఖను నిర్వహించే వారు లేరా? అన్న సణుగుడు పార్టీ శ్రేణుల్లో వ్యక్తమయింది. సంక్షోభంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడానికి సమర్థుడైన ఆర్థికవేత్త కావాలన్నది పీవీ భావన. ఇప్పుడు కూడా దాదాపు అలాంటి ఘటనే జరిగింది. విదేశాంగ కార్యదర్శిగా పనిచేసిన జయశంకర్ ను ఏకంగా ఆ శాఖ మంత్రిగా నియమించడం ద్వారా మోదీ సంచలనం సృష్టించారు. కాంగ్రెస్ మాదిరిగానే ఇప్పుడు భారతీయ జనతా పార్టీలోనూ జయశంకర్ నియామకంపై ఒకింత అసంతృప్తి వ్యక్తమయింది.విదేశాంగను నిర్వహించే సమర్థుడైన నాయకుడు పార్టీలో కరవయ్యారా? అన్న ప్రశ్నలు వినిపించాయి. కానీ మోదీ వీటిని లెక్క చేయలేదు. అంతర్జాతీయ పరిస్థితులు
అత్యంత సంక్లిష్టంగా ఉన్న నేపథ్యంలో ఐఎఫ్ఎస్ అధికారిగా మూడు దశాబ్దాలకు పైగా అనుభవం గల అధికారి జయశంకర్ సేవలు అవసరమని మోదీ గుర్తించారు. విదేశాంగ శాఖ కార్యదర్శి ఆ శాఖ మంత్రిగా ఎంపిక కావడం ఇది రెండో సారి. గతంలో మన్మోహన్ హయాంలో 2004లో కె.నట్వర్ సింగ్ విదేశాంగ మంత్రి అయ్యారు. నట్వర్ సింగ్ కు కూడా విదేశాంగ కార్యదర్శిగా పనిచేసిన అనుభవం ఉంది. ఐఎఫ్ఎస్ అధికారి పదవికి రాజీనామా చేసి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. మోదీ జయశంకర్ ల మధ్య బంధం ఈనాటిది కాదు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వారి మధ్య స్నేహం ఏర్పడింది. ముఖ్యమంత్రి హోదాలో్ మోదీ చైనాలో పర్యటించినప్పుడు జయశంకర్ ఆ దేశంలో భారత రాయబారిగా (2007 – 2013) ఉన్నారు. అప్పట్లో మోదీ పర్యటన ఏర్పాట్లను జయశంకర్ దగ్గరుండి చూశారు. తాజాగా 2014లో మోదీ ప్రధాని అయ్యాక వారి మధ్య స్నేహం మరింత బలపడింది. అప్పట్లో విదేశాంగ శాఖ కార్యదర్శిగా మహిళా అధికారి సుజాతా సింగ్ ఉండేవారు. అప్పట్లో చోటు చేసుకున్న భారత దౌత్యాధికారి దేవయాని భోబాలగాడే ఉదంతం ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. దీతో 2015 జనవరిలో విదేశాంగ కార్యదర్శిగా ఉన్న సుజాతాసింగ్ స్థానంలో్ జయశంకర్ ను నియమించారు. విదేశాంగ కార్యదర్శిగా ఇరు దేవాల సంబంధాలను బలోపేతం చేసేందుకు జయశంకర్ కృషి చేశారు. గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా కనీసం మోదీకి
వీసాను ఇచ్చేందుకు నిరాకరించిన వాషింగ్టన్ తన వైఖరిని మార్చుకుని ఆయనకు ఘనస్వాగతం పలకడంలో తెరవెనక జయశంకర్ కృషి ఉంది. తర్వాత రోజుల్లో మోదీ అమెరికా, ఇతర దేశాల పర్యటనల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. నాటి విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కన్నా ప్రధాని మోదీ జయశంకర్ కు ప్రాధాన్యం ఇచ్చారన్న విమర్శలు అప్పట్లో వినిపించాయి. జయశంకర్ తన సేవలతో మోదీనే కాకుండా అంతకు ముందు ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ ను కూడా ఆకట్టుకున్నారు. 2013లో జయశంకర్ ను విదేశాంగమంత్రిగా తీసుకోవాలని మన్మోహన్ సింగ్ నిర్ణయించారు. కానీ పార్టీలోని అంతర్గత వత్తిళ్ల వల్ల ఆ నిర్ణయాన్ని అమలు చేయలేకపోయారు.భారత రాయబారిగా జయశంకర్ వివిధ దేశాల్లో పని చేశారు. కానీ చైనా, అమెరికాల్లో పనిచేసినప్పుడు ప్రభుత్వ పెద్దల దృష్టిలో పడ్డారు. 2009 జూన్ ను ంచి 2013 డిసెంబరు వరకూ దాదాపు నాలుగున్నరేళ్ల పాటు చైనాలో రాయబారిగా పనిచేశారు. చైనాలో ఇంత సుదీర్ఘ కాలం రాయబారిగా పని చేసింది ఆయన ఒక్కరే కావడం గమనార్హం. చైనాలో పనిచేయడం నిజంగా కత్తిమీద సామే. ఆ దేశంతో గతంలో మనం యుద్ధం చేశాం. సరిహద్దు వివాదం ఉంది. ఇతరత్రా అనేక సమస్యలు ఉన్నాయి. అయినప్పటికీ వ్యూహాత్మకంగా వ్యవహరించి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించి సంబంధాల మెరుగుదలకు జయశంకర్ కృషి చేశారు. డోక్లాం వివాదం సమసిపోయేలా చేయడంలో జయశంకర్
కృషి ఉంది. జయశంకర్ తండ్రి సుబ్రమణ్యం కూడా సివిల్ సర్వెంట్. ఆధుని చాణక్యుడిగా ఆయనకు పేరుంది. విదేశాంగ విధానానికి సంబంధించి అనేక కమిటీల్లో ఆయన సేవలు అందించారు. తండ్రికి తగ్గ తనయుడిగా జయశంకర్ ఎదిగారు. విదేశాంగ మంత్రిగా జయశంకర్ విజయవంతం కాగలరనడంలో ఎలాంటి సందేహం లేదు.

Related Posts