చిత్రాన్ని చూస్తే అమ్మ ప్రేమ గుర్తుకు రావాల్సిందే. అమ్మ పాలు అమృతం లాంటివి.. బిడ్డ ఎదుగుదలకు తల్లి పాలే ఆహారం. ఆకలితో కేకలు పెట్టే బిడ్డకు తల్లి పాలిచ్చి తన మాతృత్వాన్ని పంచుతుంది. ఆ మాతృత్వపు స్పర్శతో ఆ బిడ్డ హాయిగా నిద్ర పోతోంది. మరి అలాంటి అమ్మ.. ఆకలితో అలమటిస్తున్న ఓ జింక పిల్లకు పాలిచ్చి.. మాతృమూర్తి గొప్ప తనాన్ని చాటి చెప్పింది. ఈ సుందరమైన దృశ్యాన్ని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి ప్రవీణ్ కశ్వాన్ తన ట్విట్టర్ పేజీలో షేర్ చేశారు. రాజస్థాన్ జోధ్‌పూర్‌లోని బిష్ణోయ్ కమ్యూనిటీకి చెందిన ఓ మహిళ.. జింక పిల్లకు పాలిచ్చిన దృశ్యాన్ని షేర్ చేసిన ప్రవీణ్ కశ్వాన్.. బిష్ణోయ్ కమ్యూనిటీ మహిళలు జంతువుల పట్ల ఎంత జాగ్రత్త తీసుకుంటున్నారో ఈ చిత్రాన్ని చూస్తే అర్థమవుతుందన్నారు. ఈ జంతువులు వారి పిల్లల కంటే తక్కువ కాదు అని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ మహిళపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.