YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

పదేళ్లు హోదా అన్నారు.. ఇప్పుడెందుకివ్వరు?

Highlights

  • మాపై ఎదురు దాడి చేస్తే ప్రజలు ఊరుకోరు
  • రెవెన్యూ లోటు నిధులకు లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు
  • శాసన సభ సీట్లు పెంచాలి.. అందుకు డబ్బులేమీ అవసరం లేదు కదా?
  • శాసన సభలో సీఎం చంద్రబాబు
పదేళ్లు హోదా అన్నారు.. ఇప్పుడెందుకివ్వరు?

రాష్ట్రవిభజన సమయంలో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిన భాజపా ఇప్పుడెందుకు ఇవ్వడంలేదని తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. 14వ ఆర్థిక సంఘం వద్దని చెప్పినందువల్లే ఎవరికీ ప్రత్యేకహోదా ఇవ్వడంలేదని ఇప్పుడు భాజపా అంటోందని, అలాంటప్పుడు ప్రస్తుతం హోదా కింద ఇప్పుడు ఏయే రాష్ట్రాలకు ఎంతమేర నిధులు, సౌకర్యాలు కల్పిస్తున్నారో అవన్నీ ఆంధ్రప్రదేశ్‌కు తప్పకుండా ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేశారు. బుధవారం ఆయన అసెంబ్లీలో రాష్ట్ర విభజన హామీలపై కీలక ప్రసంగం చేశారు.

‘‘రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీపడబోను. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తెదేపా, భాజపా కలిశాయి. పారిశ్రామిక ప్రోత్సాహకాలు మాకు ఇవ్వాలని అడిగాను. ముందుగానే లాలూచీ పడినట్టు మాట్లాడితే మాత్రం సరికాదు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌ హక్కు అని ప్రజలు భావిస్తున్నారు. రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకోవాలని కోరుతున్నారు. అంతా దానికోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఏవైతే చెప్పారో అవన్నీ ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తున్నా. హోదా అనేది ఆంధ్రప్రదేశ్‌ ప్రజల హక్కు. దాన్ని గౌరవించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది.

మాపై ఎదురుదాడిచేస్తే ప్రజలు వూరుకోరు 
విభజన సమయంలో భాజపా ఆంధ్రప్రదేశ్‌కు పదేళ్లపాటు హోదా ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ప్రకటించింది. పారిశ్రామికంగా ప్రోత్సాహకం కల్పించేందుకు పన్ను రాయితీలు.. రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతాలకు బుందేల్‌ఖండ్‌ తరహాలో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. దాన్ని మీకు గుర్తుచేస్తున్నా. మీరు(భాజపా) దాన్నుంచి తప్పించుకోలేరు. మీరు దిల్లీకి వెళ్లి మాట్లాడితే అంతా హర్షిస్తాం. అలాకాకుండా భాజపా నేతలు మాపై ఎదురుదాడి చేస్తే మాత్రం ప్రజలు వూరుకోరు. నేను 29 సార్లు దిల్లీకి వెళ్లాను. అందరినీ కలిశాను. పదేపదే విజ్ఞప్తి చేశాను. మా మంత్రులను, అధికారులను, ఎంపీలను పంపాను. ప్రత్యేకహోదా ఇవ్వరు, నిధులు ఇవ్వరంటే చాలామంది ఆందోళన చెందారు. భయబ్రాంతులకు గురయ్యారు. ఆ సమయంలో ప్రధానికి ఫోన్‌చేసి ఇక్కడి పరిస్థితిని వివరిస్తే.. ఆయన రమ్మన్నారు. దిల్లీకి వెళ్లాం. నీతిఆయోగ్‌ను పిలిచి చెబితే అన్నీ వివరించాం. పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తే అనుకున్న సమయానికి పూర్తవుతుందని భావించి రాష్ట్రానికి ఇవ్వాలని నీతి ఆయోగ్‌ సిఫారసు చేసింది. రాష్ట్రానికి జీవనాడి ప్రాజెక్టు అది. ఇప్పటివరకు పోలవరం కోసం 13,054 కోట్లు ఖర్చుపెట్టాం. కేంద్రం దీనికోసం రూ.5,349.70 కోట్లు ఇచ్చింది. మనం ఖర్చుపెట్టిన దాంట్లో ఇంకా రూ.2568 కోట్లు రావాల్సి ఉంది. రూ.4,932 కోట్లకు లెక్కలను పోలవరం అథారిటీ ద్వారా కేంద్రానికి పంపాం. పోలవరం అథారిటీకి ఎప్పటికప్పుడు వివరాలు ఇస్తున్నాం. ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనైనా పూర్తి చేసుకోవాలి.

ఆ లెక్కలు చెప్పాల్సిన అవసరంలేదు 
రాష్ట్ర విభజన తర్వాత గవర్నర్‌ పాలనలో ఆదాయ లోటును నిర్థారించారు. రెవెన్యూ లోటు రూ.16,072 కోట్లు ఉందని అప్పట్లో తేల్చారు. కేంద్రం మాత్రం రూ.3900 కోట్లు మాత్రమే ఇచ్చింది. రెవెన్యూ లోటు గురించి అడిగితే లెక్కలు అడుగుతున్నారు. తెలుగు రాష్ట్రాలు ప్రాధాన్యతలను బట్టి బడ్జెట్‌లో మార్పులు చేసుకున్నాయి. ఆ ప్రకారమే రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ, పీఆర్‌సీలాంటి వాటిని తీసుకున్నాం. కేంద్రం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోతే రాష్ట్రం ఇబ్బంది పడదా? కేంద్రం ఒప్పుకున్న మేరకు నిధులు ఇవ్వకపోవడం న్యాయమా? రెవెన్యూలోటు కింద ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు.

విశాఖకు రైల్వేజోన్‌ ఇవ్వాల్సిందే 
రైల్వేజోన్‌ ఇస్తామని కేంద్రం స్పష్టంగా చెప్పింది. విభజన తర్వాత ఆర్నెళ్లలోపు ఇస్తామన్నారు. నాలుగేళ్లయినా రైల్వేజోన్‌ ఎందుకు ఇవ్వడంలేదు? విశాఖలో రైల్వేజోన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాం. సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకొని అమరావతి రాజధాని నిర్మాణం చేపడుతున్నాం. దిల్లీకి మించిన నగరాన్ని నిర్మించేందుకు సహకరిస్తామని ఆనాడు ప్రధాని తిరుపతిలో హామీ ఇచ్చారు. హైదరాబాద్‌ లాంటి నగరం నిర్మాణానికి రూ.5లక్షల కోట్లు అవుతుందని ముందే చెప్పాం. ఆంధ్రప్రదేశ్‌కు మహానగరం కావాలనుకోవడం తప్పుకాదు. అమరావతి నిర్మాణానికి రూ.1500 కోట్లు ఇచ్చారు. వాటికి లెక్కలు అందజేశాం. కేంద్రం ఉదారంగా ముందుకొచ్చి రాజధాని నగర నిర్మాణానికి నిధులు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది.

దుగరాజపట్నంపై సమాధానంలేదు 
రాష్ట్రంలో 11 జాతీయ విద్యా సంస్థలకు రాష్ట్రం తరఫున భూములు కేటాయించాం. వాటి నిర్మాణానికి ఇప్పటివరకు కేవలం రూ.420 కోట్లు మాత్రమే ఇచ్చింది. తిరుపతిలో ఐఐటీకి  కేవలం రూ.100 కోట్లు మాత్రమే ఇచ్చారు. దుగరాజపట్నం పోర్టు నిర్మాణం సాధ్యం కాదంటున్నారు. ఎందుకు సాధ్యం కాదంటే చెప్పట్లేదు. హామీ మేరకు దుగరాజపట్నంపోర్టు నిర్మాణం చేయాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నా. ఇకపోతే ఏపీ శాసనసభ సీట్లు పెంచాల్సిన అవసరం ఉంది. సీట్ల పెంపునకు డబ్బుల అవసరం లేదు కదా? సీట్లు పెంచాలంటే నాకోసం అడుగుతున్నానని అనుకుంటారు. అందుకే నేను ఆ డిమాండ్‌ను అడగడంలేదు. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్‌ అంశాలను అమలు చేయాలని కోరుతున్నాం.

ఆ రోజు ఒప్పుకొని ఇప్పుడెందుకివ్వడంలేదు? 
పార్లమెంట్‌లో బిల్లు పాస్‌ చేసినప్పుడు ప్రస్తుత కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పోరాడి బిల్లులో కొన్ని అంశాలు పెట్టి పాస్‌ చేయించారు. మరి దాన్ని అమలుచేయడంలో మీరెందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్‌ పట్ల ఎందుకింత ఉదాసీనత? అని అడుగుతున్నా. అప్పుడు ఆంధ్ర ప్రజలు పోరాడారు. ఇప్పటికీ పోరాడుతున్నారు. సరికాదని ప్రతిపక్ష పార్టీలన్నీ చెబుతున్నప్పుడు ఎందుకు కనికరించడంలేదు. ఎవరైతే రాష్ట్రానికి అన్యాయం చేశారో.. ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మళ్లీ మేం అధికారంలోకి వస్తే తొలి సంతకం ప్రత్యేకహోదాపైనేనని ప్రకటనలు చేసే పరిస్థితి ఉంటే మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారో చెప్పాలి. నాలుగేళ్లు నేను ఆవేదనతో, బాధతో ఎంతో ఓపికిగా 29సార్లు దిల్లీకి వెళ్లి అడిగితే కనీసం కనికరించలేదు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలనే ఎందుకు అమలుచేయడంలేదు. మేం సమాఖ్య స్ఫూర్తికి కట్టుబడి ఉన్నాం.

ఆ లీకులు చూసి బాధేసింది 
నిన్న, మొన్న వచ్చిన లీకులు చూసి బాధేసింది. తెలుగువారి ఆత్మగౌరవం అంటే.. తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి కూడా ఇదే విధమైన డిమాండ్లు వస్తాయని లీకులు ఇస్తున్నారు. తెలుగు వాళ్లను అవమానించకపోతే తెదేపా ఆవిర్భవించేది కాదని సాక్షాత్తూ ప్రధానే పార్లమెంట్‌లో చెప్పారు. లాలూచీ రాజకీయాలు నా జీవితంలో లేవు. ఈ దేశంలో ఉన్న సీనియర్‌ నాయకుల్లో నేను తొలిస్థానంలో ఉంటా. అది ప్రజలు ఇచ్చిన గౌరవం. తెలుగు జాతికి ఎప్పటికీ రుణపడి ఉంటా. జాతీయ రాజకీయాల్లో నేను కీలక పాత్ర పోషించాను. నిప్పులా బతుకుతున్నా.. ఎవరికీ భయపడను. నా జీవితంలో శాశ్వతంగా తెలుగు ప్రజలకు రుణపడి ఉంటా.

Related Posts