YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

దినకరన్ కు దిక్కేది....

దినకరన్ కు దిక్కేది....

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

దూసుకొచ్చిన దినకరన్ ఇటీవల జరిగిన లోక్ సభ, ఉప ఎన్నికల తర్వాత చతికల పడ్డారు. అన్నాడీఎంకేను చీల్చాలన్న ఉద్దేశ్యంతో దినకరన్ చేసిన ప్రయత్నాలు ఫలించకపోగా తాను, తన పార్టీ నవ్వుల పాలయినట్లు కనపడుతోంది. శశికళ మేనల్లుడిగా టీటీవీ దినకరన్ ప్రారంభించిన అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం పార్టీ కోలుకోలేని పరిస్థితికి వచ్చింది. దినకరన్ పార్టీలో చేరిన అనేక మంది నేతలు తిరిగి సొంత పార్టీ అన్నాడీఎంకేలో చేరుతుండటం దినకరన్ కు మింగుడు పడటం లేదు.ఆర్కే నగర్ ఉప ఎన్నికల తర్వాత దినకరన్ దూకుడు మీద ఉన్నారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో విజయం సాధించడంతో ఇక తనకు తిరుగులేదనుకున్నారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో దినకరన్ అన్నాడీఎంకే, డీఎంకే అభ్యర్థులను చిత్తు చిత్తుగా ఓడించారు. దీంతో తమ కుటుంబానికి ప్రజల నుంచి భారీగా మద్దతు ఉందని భావించారు. వెంటనే ఏమీ ఆలోచించకుండా కొత్త పార్టీ అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం పార్టీని స్థాపించారు.అయితే ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో దినకరన్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడింది. దినకరన్ గూటికి చేరడంతో దాదాపు 14 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. వీరితో పాటు వివిధ కారణాలతో మొత్తం 21 అసెంబ్లీ స్థానాలకు
ఉప ఎన్నికలు జరిగాయి. 38 లోక్ సభస్థానాలు, 21 అసెంబ్లీ ఉప ఎన్నికల్లో దినకరన్ ను ప్రజలు పట్టించుకోలేదు. ఒక్క స్థానమూ గెలవలేదు. దీంతో దినకరన్ పార్టీ నీరుగారి పోయింది.ఘోరమైన ఓటమి కారణంగా దినకరన్ పార్టీలోని అనేకమంది నేతలు అన్నాడీఎంకే లో చేరుతున్నారు. అన్నాడీఎంకే ప్రభుత్వానికి మరో రెండేళ్ల పాటు అధికారం ఉండటం కూడా ఇందుకు కారణంగా చెప్పాలి. అక్రమాస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న శశికళ వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశముంది. దీంతో అనేకమంది దినకరన్ పార్టీకి చెందిన నేతలు తిరిగి సొంతగూటికి చేరుకుంటుండటంతో ఆ పార్టీలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎంత మంది పార్టీని వీడినా తమ బలం తగ్గదని దినకరన్ మాత్రం బింకాలకు పోతున్నారు.

Related Posts